సాధారణంగా మన హిందూ సంస్కృతిలో దానధర్మాలకు చాలా ప్రత్యేకత ఉంది. మన హిందూ సంస్కృతి ప్రకారం పేదరికంలో ఉన్న వారికి దానధర్మాలు చేసి ఆదుకోవడం చాలా ముఖ్యమైనది. అలాగే జాతకంలోని దోషాలు తొలగిపోవడానికి బ్రాహ్మణుల సూచన మేరకు అనేక వస్తువులు దానం చేస్తూ ఉంటారు. ఇలాంటి దానాలలో గోదానం కూడా ఒకటి. గోదానం చేయడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. గోదానం చేయడం వల్ల మన జీవితంలో కలిగే శుభ ఫలితాలు, గోదానం వెనుక గల కారణం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పూర్వం ఔద్దాలకి అనే మహర్షి ఉండేవాడు. హిందూ శాస్త్రంలో వివరించినట్లు ఆయన తన జీవితాన్ని గడిపేవాడు. ఈ క్రమంలో ఒకరోజు తన కుమారుడైన నాచికేతుడిని పిలిచి నదీ తీరంలో ఉన్న సమిధలు, దర్భలను తీసుకురమ్మని ఆదేశిస్తాడు. నదీ తీరానికెళ్లిన నాచికేతుడికి అవి కనిపించవు. దీంతో తిరిగి ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని తన తండ్రి దగ్గరకు వెళ్లి చెబుతాడు. అప్పటికే ఆకలితో ఉన్న మహర్షి తన యజ్ఞకార్యాన్ని పూర్తిచేయాలన్న నిశ్చయంతో ఉన్న మహర్షితో కొడుకు ఇలా చెప్పటంతో ఆయనకు కోపం వచ్చి నాచికేతున్ని నరకానికి వెళ్లు అని శపిస్తాడు. దీంతో నాచికేతుడు ఒక్కసారిగా కుప్ప కూలిపోతాడు. అయితే ఆ తర్వాత తన తొందరపాటును తెలుసుకున్న ఔద్దాలకి ఆ రాత్రంతా రోదిస్తాడు.
కానీ మరుసటి రోజు సూర్యోదయ సమయానికి నాచికేతుడు లేచి తిరిగి రాగానే ఔద్దాలకి పట్టరాని సంతోషం వచ్చింది. ఔద్దాల మహర్షి తన కుమారుడికి నరకానికి వెళ్లమని శాపం పెట్టాడే గానీ చనిపొమ్మని శాపం ఇవ్వలేదు. కనుక నాచికేతుడిని అతిథిగా పరిగణిస్తున్నట్టు యమధర్మరాజు చెబుతాడు. అయితే పుణ్యలోకాలకు వెళ్లాలంటే ఏం చేయాలో చెప్పాలని నాచికేతుడు యమున్ని అడుగుతాడు. దీంతో శుభ సమయాల్లో గోదానం చేయడం ద్వారా పుణ్యలోకాలకు చేరుకుంటారని యముడు చెబుతాడు. అయితే గోదానం చేయటానికి ముందు మూడు రాత్రులు నేల మీద నిద్రించాలి. కేవలం నీటిని తాగుతూ దీక్ష చేసి,ఆ తరువాత గోదానం చేయాలి. దీంతో పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి.