మన హిందూ ధర్మంలో వారంలో ఉన్న ఏడు రోజులు కూడా ఒక్కో దేవుడికి అంకితం చేశారు. ఏడు రోజులపాటు ప్రజలందరూ కూడా ఒక్కో దేవుడికి ఒక్క రోజున ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇలా దేవాలయాలలో కానీ ఇంట్లో కానీ దేవుళ్లకు పూజలు నిర్వహించటం వల్ల జీవితంలో ఎదురయ్యే కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయని ప్రజల విశ్వాసం. వారంలో ఉన్న ఏడు రోజులలో ఏ రోజు ఏ దేవుడికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వారంలో మొదటి రోజు ఆదివారం. ఈ ఆదివారం రోజుని ఆ సూర్యభగవానుడికి అంకితం చేశారు. సూర్య భగవానుడు భూమిపై ఉన్న సమస్త జీవరాసులకు ఆయుష్షు, ఆరోగ్య శ్రేయస్సును ఇస్తాడు. అందువల్ల ఆదివారం రోజున సూర్యభగవానుడికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించాలి.
ఇక సోమవారం ఆ పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన దినం. అందువల్ల సోమవారం రోజున ఆ పరమేశ్వరుడికి ప్రత్యేకమైన పూజలు చేయటం వల్ల ఆ పరమేశ్వరుడి అనుగ్రహం పొందవచ్చు. పరమశివుని అనుగ్రహం పొందిన వారు అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో జీవిస్తారు.
మంగళవారం రోజు ఆంజనేయునికి చాలా ఇష్టమైన రోజు. అందువల్ల మంగళవారం రోజున ఆంజనేయుడికి పూజ చేయడం వల్ల జీవితంలోని ఆటంకాలు భయాలు అన్నీ తొలగిపోతాయి.
బుధవారం రోజు వినాయకునికి ఇష్టమైన రోజు. బుధవారం రోజున భక్తిశ్రద్ధలతో వినాయకుడిని పూజించటం వల్ల మన జీవితంలో ఎదురయ్యే విఘ్నాలు అన్నీ కూడా తొలగిపోతాయి.
మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన గురువారం రోజున ఆ మహావిష్ణువుకి ప్రత్యేక పూజలు చేయటం వల్ల మహావిష్ణువు అనుగ్రహం లభించి జీవితంలో ఎదురైన కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. జీవితాంతం ఆ మహావిష్ణువు అనుగ్రహం పొందాలంటే ప్రతి గురువారం రోజున మహావిష్ణువు ముందు అరటిబోదులో దీపం వెలిగించాలి.
శుక్రవారం రోజు మహాలక్ష్మి, దుర్గాదేవి , అన్నపూర్ణేశ్వరి దేవతలను పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని ప్రజల విశ్వాసం. ముఖ్యంగా శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించటం వల్ల ఆ దేవి అనుగ్రహం పొంది ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. అన్నపూర్ణ దేవిని పూజించడం వల్ల ఇంట్లో ఆహారానికి కొరత ఉండదు.
శనివారం శని దేవునికి ఇష్టమైన రోజు. అందువల్ల శనివారం రోజున శని దేవుడికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని ప్రజల విశ్వాసం. ప్రతి శనివారం రోజున ఆ శని దేవుని పూజించడం వల్ల జాతకంలో ఉన్న దోషాలు కూడా తొలగిపోతాయి.