సాగర మధనం సమయంలో మహా విష్ణువు కూర్మావతారం ధరించాడు. మహావిష్ణువు అన్ని అవతారాల్లో దుష్ట శిక్షణ జరిగింది. కూర్మావతారంలో మాత్రం దుష్టశిక్షణ జగరలేదు. మహావిష్ణువు కూర్మావతారంలో కొలువై ఉన్న ఏకైక ఆలయం మన ఆంధ్రప్రదేశ్లో ఉండటం విశేషం. శ్రీకాకుళం పట్టణం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న “శ్రీ కూర్మం” అనే గ్రామంలో ఈ అరుదైన దేవాలయం ఉంది. గర్భగుడిలో కొలువై ఉన్న కూర్మనాధ స్వామి విగ్రహం నుంచి ఆలయం వెలుపల గల నిర్మాణాల వరకూ ఇక్కడ ప్రతీదీ ప్రత్యేకం. ప్రపంచవ్యాప్తంగా కూర్మావతారంలో ఉన్న మహావిష్ణు ఆలయం కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఉంది.
అయితే ఇలా కేవలం మహావిష్ణువు కూర్మావతారంలో ఒకే ఒక్క ప్రదేశంలో కొలువై ఉండటానికి కారణం శాపం. ద్వాపర యుగంలో బలరాముడు శ్రీకూర్మం లో కొలువై ఉన్న మహావిష్ణు దర్శనానికి వచ్చిన సమయంలో క్షేత్రపాలకుడైన బైరవుడు ఆయనను లోనికి అనుమతించలేదు. దీంతో ఆగ్రహానికి గురైన బలరాముడు భూమిపై మరెక్కడా కూర్మావతారంలో ఆలయం ఉండకూడదని శపిస్తాడు. అందువల్లే ప్రపంచంలో ఉన్న ఏకైక కూర్మావతార క్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందినట్లు పురాణాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏకైక క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన కూర్మావతార విష్ణు దేవాలయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయానికి గల విశేషాలు కూడా చాలా ఉన్నాయి.
విష్ణువు కూర్మావతారంలో ఉన్న ఏకైక స్వయంభు ఆలయం ఇది. శ్రీకూర్మంలో స్వామి వారి విగ్రహం పడమటి ముఖంగా ఉండడం ఇక్కడ విశేషం. ఏ ఆలయంలో లేని విధంగా ఇక్కడ రెండు ధ్వజస్తంభాలు కనిపిస్తాయి. ఆలయానికి వెలుపల శ్వేత పుష్కరిణి ఉంటుంది. ఆలయంలో ఒక రాతి పీఠంపై కూర్మనాధ స్వామి దర్శనమిస్తారు. అడుగు ఎత్తు, ఐదడుగుల పొడవు, నాలుగు అడుగుల వెడల్పుతో స్వామి వారి విగ్రహం ఉంటుంది. ప్రపంచంలో దుర్గామాత వైష్ణోదేవి రూపంలో ఉన్న రెండవ ఆలయం శ్రీకూర్మం. ఇక్కడికి వారణాశికి వెళ్లడానికి సొరంగ మార్గం ఉందని, ప్రస్తుతం దీనిని మూసివేసినట్లు చెబుతారు. వారణాసిలో లాగా చనిపోయిన వారి అంతిమ కర్మలను నిర్వహించే మోక్ష స్థానంగా శ్రీకూర్మం ప్రసిద్ది.