తెలుగు పండగల్లో సంక్రాంతి అతి పెద్ద పండగ. ఈ పండగకి ప్రతి సంవత్సరం అత్త, మామ కూతురు, అల్లుడిని ఇంటికి పిలవడం అనేది అనాధి కాలం నుంచి వస్తున్న ఆచారం. అందులోనూ కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే పండగకి పిలిచి సంక్రాంతి కానుక కూడా ఇవ్వాలి. కూతురు,అల్లుడికి కొత్త బట్టలు పెట్టి ఇంకేదైనా వస్తువును కానుకగా ఇస్తారు. ఈ మర్యాదల్లో ఎక్కడైనా తేడా వచ్చిందంటే ఇక అంతే మరి సంక్రాంతికి అల్లుడు అలిగి ఇంటికి వెళ్లిపోయాడు అంటారు. అలాగే సంక్రాంతికి కూతురు అల్లుడు ఇంటికి వస్తున్నారంటే… వెరైటీ వంటకాలు వాళ్లని ఈ మూడు రోజుల పాటు సరదాగా బయటకు తీసుకెళ్ళడాలు, సినిమాలు షికార్లు ఇలా ఎన్నెన్నో ఉంటాయి.
సంక్రాంతి పండుగ నాడు కూతురు అల్లుడిని ఇంటికి తప్పక ఆహ్వానించాలనే సంప్రదాయం ఎప్పటినుంచో శాస్త్రీయంగా వచ్చింది. అయితే, ఇది కొత్త వారైతేనే ఆహ్వానించాలి.,.. పెళ్లయి రెండేళ్లు అయిపోయింది కాబట్టి అవసరం లేదనేవాదన ఇటీవల కాలంలో వినిపిస్తోంది. అత్తమామలు జీవించి ఉన్నన్నాళ్లు.. అల్లుళ్లను, కూతుళ్లను ఈ పండగకు ఆహ్వానించాల్సిందే. వారికి వస్త్రాలు బహూకరించి, భోజనం పెట్టడం ద్వారా మామగారింట సౌభాగ్యం మరింత ఇనుమడిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కూతురు లక్ష్మీ స్వరూపం కాబట్టి.. ఆ లక్ష్మి ఎన్నేళ్లయినా.. పాతబడిపోదుకదా! ఈ విషయాన్ని గుర్తించుకోవాలి.
అదే విధంగా ఆడపిల్లలు పెళ్ళయ్యాక అత్తవారిల్లు తర్వాత పెట్టినిల్లు ఇవి రెండిటి మీద వారికి మమకారం ఎక్కువగానే ఉంటుంది. ఒకటి పెళ్ళైనా కూడా పుట్టింటి మీద చాలా మంది అమ్మాయిలకి మమకారం అనేది ఎప్పటికీ అలానే ఉంటుంది. పండగ వచ్చిందంటే చాలు ఎప్పుడు మా అమ్మ రమ్మంటదా, మా నాన్న పిలుస్తాడా అని ఎదురు చూస్తారు. ఎందుకంటే పండగ అయినా పబ్బమైనా పెద్దవాళ్ళు ఉన్నంత వరకే కాబట్టి.