మీరు వెళ్లొద్దు సారూ… కన్నీరు కార్చిన విద్యార్దులు (వీడియో)

ఉపాధ్యాయిడంటే… ఏ విద్యార్దికైనా భయమే.. కానీ ఆ ప్రిన్సిపాల్ అంటే మాత్రం ఆ పాఠశాలలో అందరికి గౌరవం.. కాదు ప్రేమ… ఆ ప్రిన్సిపాల్ కు కూడా విద్యార్థులంటే ప్రాణం. తండ్రిలా విద్యార్ధులపై వాత్సల్యం చూపారు. అందుకే బదిలీపై ఆ ప్రిన్సిపాల్ పాఠశాల వదిలి వెళ్తుంటే విద్యార్థులంతా చుట్టుముట్టారు. వెళ్లొద్దు సార్.. ప్లీజ్.. అంటూ అడ్డుకున్నారు. దీంతో ఉద్వేగానికి లోనై సదరు ప్రిన్సిపాల్ కూడా ఇక్కడి నుంచి వెళ్లలేకపోయారు. ఈ ఘటన గురువారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మోడల్ స్కూల్ లో జరిగింది. విద్యార్ధులు సారును అడ్డుకొని ఏడ్చిన వీడియో కింద ఉంది చూడండి. 

ఐదేళ్ల క్రితం కళ్యాణదుర్గం మోడల్ పాఠశాల తరగతులు ప్రారంభమయ్యాయి. ఎఫ్ ఏసీ ప్రిన్సిపాల్ గా వరప్రసాద్ బాద్యతలు చేపట్టారు. అరకొర వసతులతో మొదట్లో పాఠశాలను నడుపుకొచ్చారు. విద్యార్ధులను తండ్రిలా చూశారు. పేద విద్యార్థులకు ఫీజులు సైతం చెల్లించారు. బాలురకు భోజన వసతి లేకుంటే సొంత డబ్బులతో భోజనం పెట్టారు. 10 వ తరగతి పిల్లలకు పరీక్షలకు ముందు నెలరోజుల ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహించి భోజన వసతి కల్పించారు.

ప్రిన్సిపాల్ వరప్రసాద్ వెళ్లకుండా అడ్డుకుంటున్న విద్యార్థులు

సుదూర ప్రాంతాల్లో రెజ్లింగ్, జూడో, హ్యాండ్ బాల్ లాంటి పోటీలకు వెళ్లే క్రీడాకారులకు ఖర్చులు భరిస్తూ సౌకర్యం కల్పించారు. విద్యార్ధులతో చాలా స్నేహంగా ఉండేవారు. దాంతో వరప్రసాద్ కు విద్యార్ధులకు విడదీయరాని బంధం ఏర్పడింది. ఇంతటి అనుబంధాన్ని ఏర్పరుచుకున్న ప్రిన్సిపాల్ వరప్రసాద్ ను పామిడి ఆదర్శ పాఠశాలకు బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులిచ్చారు. ఈ విషయం విద్యార్థులకు తెలియడంతో వారంతా సార్ ఎక్కడికి వెళ్లొద్దంటూ అడ్డుపడ్డారు. కన్నీటి పర్యంతమయ్యారు. విద్యార్ధిని విద్యార్దులు ఆయనను చుట్టముట్టడంతో భావోద్వేగానికి లోనై ప్రిన్సిపాల్ సారు కూడా ఏడ్చారు.

విద్యార్థులంతా తమ ప్రిన్సిపాల్ ను మరో చోటకు బదిలీ చేయడాన్ని నిరసిస్తూ ధర్నా చేశారు. ప్రిన్సిపాల్ పాఠశాల దాటకుండా అడ్డుకుని చుట్టు ముట్టారు. ప్రిన్సిపాల్ వెళ్లకూడదు ఇక్కడే ఉండాలి అంటూ నినాదాలిచ్చారు. అనంతరం ర్యాలీగా వెళ్లిన విద్యార్ధులంతా ఎమ్మెల్యే ఉన్న హనుమంతరాయ చౌదరి ఇంటికి వెళ్లి ప్రిన్సిపాల్ బదిలీ ఆపాలని వినతి పత్రం అందజేశారు.