హైదరాబాద్ మూసీనదిలో ఇద్దరు మహిళల నరబలి

సాంకేతికంగా ప్రపంచం ఎంతో అభివృద్ది చెందుతున్నా కూడా మనుషుల ప్రవర్తనలో మార్పు రావడం లేదు. మూఢ నమ్మకాల పేరుతో, మంత్రాల నెపంతో దారుణాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లంగర్ హౌజ్ పరిధిలోని అత్తాపూర్ మూసీ నది వద్ద అమానుషం జరిగింది. ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు.

మొఘల్‌ నాలా రింగ్‌ రోడ్డు నుంచి రాజేంద్రనగర్‌ వెళ్లే దారిలో పీవీ నర్సింహారావు ఎక్స్ ప్రెస్ వే   పిల్లర్లు ఉన్నాయి. మూసీనదిపై ఉన్న అత్తాపూర్‌ బ్రిడ్జ్‌ కింద స్థానికులు ఆకుకూరలు పండిస్తారు. రోజు మాదిరి మంగళవారం ఉదయం అక్కడికి వచ్చిన వీరు సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో పనులు పూర్తి చేసుకున్నారు.

మూసీలో కాళ్లుచేతులు కడుక్కోవడానికి వెళ్లగా, పిల్లర్‌ నెం.118 కింది భాగంలో ఒడ్డుకు సమీపంలో గడ్డి మొక్కల మధ్యలో ఓ మనిషి కాలు ఉండడాన్ని గమనించారు. దీంతో మృతదేహంగా అనుమానించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి వచ్చిన లంగర్‌హౌస్‌ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ప్రాథమికంగా లభించిన ఆధారాలను బట్టి 30–35 ఏళ్ల మధ్య వయస్కురాలైన మహిళగా గుర్తించారు. మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చగా… మరో కలకలం రేగింది. ఈ మృతదేహాన్ని తీసిన చోటే కదలిక ఉండడంతో ఇంకాస్త లోపలకు దిగిన పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే అక్కడ మరో మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. వెంటనే రెండో దాన్ని బయటకు తీశారు. ప్రాథమిక పరిశీలన నేపథ్యంలో ఓ మృతదేహానికి తల వెనుక భాగంలో, మరోదానికి కన్ను, నుదురు ప్రాంతాల్లో గాయాలు ఉన్నట్లు తేల్చారు. మృతదేహాలు కుళ్లిపోకపోవడంతో హత్యలు సోమవారం రాత్రి లేదా మంగళవారం తెల్లవారుజామున జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. 

ఈ మహిళలను పథకం ప్రకారం హత్య చేశారా లేక గుర్తు తెలియని వారిని పట్టుకొచ్చి హత్య చేశారా అనేది తేలాల్సి ఉంది. వీరిని సమీపంలోని కల్లు కంపౌండ్ నుంచి తీసుకొచ్చి హత్య చేసినట్టుగా తెలుస్తోంది. వీరిని మభ్య పెట్టి హత్య చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరి వయస్సు 30, 50 సంవత్సరాలుగా పోలీసులు గుర్తించారు. వీరిని చంపటానికి ముందు అత్యాచారం చేసినట్టుగా తెలుస్తోంది.

ఈ రెండు మృతదేహాల ఒంటి నిండా పసుపు ఉంది. దీనికితోడు గతేడాది జనవరిలో వచ్చిన పౌర్ణమి తర్వాతి రోజు ఉప్పల్‌ చిలుకానగర్‌లోని రాజశేఖర్‌ ఇంటిపై చిన్నారి మృతదేహం కనిపించింది. ఈసారి పౌర్ణమి మరుసటి రోజు ఈ రెండు మృతదేహాలు బయటపడ్డాయి. దీంతో ఇది కూడా నరబలే అని పుకార్లు చెలరేగాయి. పోలీసులు మాత్రం అలాంటిదేమీ లేదని, గాయాలు సైతం అలాంటి స్థితిలో లేవని పేర్కొంటున్నారు. నిందితుల్ని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. మొత్తానికి ఈ జంట హత్యలు హైదరాబాద్ లో కలకలం రేపాయి.