తన దగ్గర పనిచేస్తున్న యువతిపై కన్నేసిన యజమాని కోరిక తీర్చాల్సిందిగా వేధించాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లి సదరు వ్యక్తిని నిలదీయగా కుమార్తెను తన దగ్గరకు పంపకుంటే అంతు చూస్తానని ఇంటికెళ్లి బెదిరించాడు. చివరికి ఈ వేధింపులు హద్దుదాటడంతో మనస్తాపానికి లోనైన సదరు తల్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ మైలార్ దేవ్ పల్లిలో జరిగింది.
మైలార్ దేవ్ పల్లిలో ఉన్న మౌనికా షాపింగ్ మాల్ ను వివేకానంద అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. ఇక్కడ భావన అనే అమ్మాయి పనిచేస్తోంది. పనిలో చేరినప్పుడే ఆమెపై కన్నేసిన వివేకానంద.. తన కోరిక తీర్చాలని వేధించాడు. దీంతో భావన ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉంటుంది. వివేకానంద భావన తల్లికి ఏదేదో చెప్పి మళ్లీ పనిలోకి తీసుకున్నాడు. మరోసారి ఏమి అననని చెప్పి జీతం పెంచి పనిలోకి తీసుకున్నాడు. వారు పేదవారు కావడంతో భావన మళ్లీ పనిలో చేరింది.
అయినా వివేకానంద తన వేధింపులు ఆపలేదు. ఏకంగా భావన తల్లి కన్యాకుమారి దగ్గరికి వెళ్లి కూతురికి కోరిక తీర్చాలని చెప్పి వేధించాడు. లేకపోతే తల్లి కూతురు ఇద్దరు తన కోరిక తీర్చండి అని వేధించాడు. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. దీంతో మానసికంగా కుంగి పోయిన కన్యాకుమారి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పరువు పోతుందన్న ఫిర్యాదుతో కేసు పెట్టలేదని, తన వల్ల తల్లి చనిపోయిందని భావన విలపించింది. భావన ఫిర్యాదుతో పోలీసులు వివేకానందను అరెస్టు చేశారు.