భర్త కాపురానికి తీసుకుపోవడం లేదని భార్య ఏం చేసిందంటే

వారిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆనందంగానే ఉన్నా వారి కాపురంలో రేపిన చిన్న చిచ్చు విడాకుల నోటిసుల వరకు దారి తీసింది. దాంతో ఆ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రస్తుతం ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉంది. పూర్తి వివరాలు ఏంటంటే…

వరంగల్‌ అర్బన్‌ జిల్లా హసన్‌పర్తి మండలం ముచ్చర్ల నాగారంకు చెందిన సంగీత, గుండ్రపల్లి గ్రామానికి చెందిన భూపతి ప్రకాశ్‌లు ఏడాది క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. కొంత కాలం కలిసి ఉండగా వీరి మధ్య మనస్పర్థలు రావడంతో సంగీతకు దూరంగా  ప్రకాశ్  ఉంటున్నాడు. తన భర్తను తనతో కలిసి ఉండేలా చూడాలని అత్తగారింటికి వచ్చి సంగీత కోరింది. దీంతో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టగా ఇద్దరు కలిసి ఉండాలని చెప్పారు.

కొన్ని నెలలు కలిసి ఉన్నప్పటికీ వీరి మధ్య మళ్లీ గొడవలు జరగడంతో ప్రకాశ్‌ విడాకుల కోసం నోటీసు పంపించాడు. దాంతో  నాలుగు రోజుల క్రితం గుండ్రపల్లి వచ్చిన సంగీత తన భర్త జాడ తెలపాలని ప్రకాశ్‌ తల్లిదండ్రులను కోరింది. ప్రకాశ్‌ ఇక్కడికి రాలేదని, ఆమెను వారు ఇంట్లోకి రానివ్వలేదు. సోమవారం భర్త వచ్చిన విషయం తెలుసుకొని సంగీత ప్రకాశ్‌ ఇంటికి వచ్చింది.

 కేసు కోర్టులో ఉండగా ఎందుకు వచ్చావంటూ భర్త ప్రకాశ్‌ కోపంతో  ఆమెను కొట్టాడు. దాంతో మనస్తాపానికి గురైన సంగీత  అతని ఇంటి ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.

సంగీతకు తండ్రి లేడు. తల్లి తన బతుకే భారమయ్యిందని దీన స్థితిలో ఉంది. ఇటువంటి పరిస్థితిలో సంగీత పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. తాము ప్రేమించి పెళ్లి చేసుకున్నామని అత్తగారి కుటుంబ సభ్యులు అతనికి లేని పోనివి చెప్పి మరో పెళ్లి చేయాలని చూస్తున్నారని తెలిపింది.తనకు తండ్రి లేడని తల్లి సాకలేని పరిస్థితి అని వివరించింది.

తనను భర్త కాదంటే తనకు చావు తప్ప మరో  మార్గం లేదని తెలిపింది.  తాను కట్న కానుకలు తీసుకురాక పోవడం, వేరే కులం కావడంతో ప్రకాశ్ కుటుంబ సభ్యులు అతనిని మార్చి తనను దూరం పెట్టేలా చేశారంది. విడాకుల నోటిసు చూసి షాకయ్యానని తెలిపింది. మామూలుగా వచ్చిన గొడవకే విడాకుల నోటిసులు పంపిస్తారా అంటూ కన్నీటి పర్యంతమైంది. తాను విడాకులివ్వనని భర్తతో కలిసి కాపురం చేస్తానని తెలిపింది. తనను భర్త ఆమోదించకుంటే ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకొని చనిపోతానని బెదిరించింది. పోలీసులు ఇరువురు కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. సంగీత కోలుకున్నానక దీని పై విచారణ వేగవంతం చేస్తామని పోలీసులు తెలిపారు.