వేరే వ్యక్తితో భార్య ఫేస్ బుక్ చాటింగ్, ఆగ్రహంతో భర్త…

విజయవాడలో దారుణం జరిగింది. తన భార్య మరో వ్యక్తితో ఫేస్ బుక్ లో చాటింగ్ చేయడంతో ఆగ్రహించిన భర్త సదరు వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆగష్టు 15న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది

కృష్ణలంకలోని మెట్ల బజార్ కు చెందిన రామాంజనేయులు శర్మ పురోహితుడు. ఇతనికి బాలాజీ నగర్ లో ఉండే ఓ వివాహితతో ఫేసుబుక్ లో పరిచయం ఏర్పడింది. వీరిద్దరు తరచూ చాటింగ్ చేసుకోవడం ఫోన్ లో మాట్లాడుకోవడం చేస్తున్నారు. భార్య ప్రవర్తనపై భర్త సాయి శ్రీనివాస్ కు అనుమానం కలగడంతో రహస్యంగా ఆమె ఫోన్ ను పరిశీలించాడు. దాంట్లో వీరిద్దరి మధ్య చాటింగ్ బయటపడింది. ఆగ్రహంతో ఊగిపోయిన శ్రీనివాస్.. తన భార్యతో చాటింగ్ చేస్తున్న రామాంజనేయులును హత్య చేయాలని ప్లాన్ వేశాడు.

ఆగష్టు 15న తన ఎలక్ట్రానిక్స్ షాపు వద్ద పూజ చేయాలంటూ రామాంజనేయులు శర్మను శ్రీనివాస్ ఫోన్ లో ఆహ్వానించాడు. శర్మ అక్కడికి చేరుకోగానే స్నేహితులు ఎన్టీఆర్, మున్నా, సాయి, సతీష్, ఫరూఖ్ లతో కలిసి శ్రీనివాస్ పై విచక్షణరహితంగా దాడి చేశారు. చుట్టు పక్కల వారు వచ్చి ఎందుకు దాడి చేస్తున్నారని అడగగా తామంతా స్నేహితులమని చెప్పి రామాంజనేయులును బైక్ పై ఎక్కించుకొని తేలప్రోలు ప్రాంతంలోని పొలాల్లో మరోసారి దాడి చేశారు. దెబ్బలకు తాళలేక శర్మ చనిపోవడంతో రోడ్డుపై శవాన్ని పడేసి వెళ్లిపోయారు.

రోడ్డు పక్కన శవం ఉందని స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు శర్మ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. మృతుడి కాల్ డేటా ఆధారంగా పోలీసులు విచారణ చేయగా చివరి ఫోన్ కాల్ శ్రీనివాస్ దిగా గుర్తించారు. శ్రీనివాస్ ను తమదైన శైలిలో విచారించగా స్నేహితులతో కలిసి తానే హత్య చేసినట్ట ఒప్పుకున్నాడు. నిందితులందరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.