భారీ వర్షాలతో అతలాకుతలమైన కేరళను ఆదుకునేందుకు అనేక మంది సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ దాత ఆకర్షణీయంగా నిలిచారు. వరద బాధితుల సహాయార్ధం తన మొదటి నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. ఇంతకీ ఎవరా దాత అనుకుంటున్నారా… అయితే ఈ స్టోరీ చదవండి…
కేరళను ఒణికించిన నిపా వైరస్ భూతానికి బలైపోయిన లినీ భర్త…. సాజీష్. కేరళలో నిపా వైరస్ వ్యాధిగ్రస్తులకు సేవచేస్తూ అదే వ్యాధి సోకి ప్రాణాలు విడిచిన నర్సు లినీ పుత్తుస్సెరి అందరి మనస్సుల్లో నిలిచిపోతే… ఆమె భర్త కూడా ఆమె అడుగు జాడల్లోనడిచి పెద్దమనసును చాటుకున్నారు.
తన భర్త సాజీష్ , పిల్లలతో లినీ
లినీ మరణం తర్వాత ఆమె భర్త సాజీష్ బహ్రెయిన్లో తాను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి తన పిల్లలను చూసుకునేందుకు కేరళ వచ్చారు. లినీ మరణంతో ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం ప్రకారం సాజీష్ కు ఉద్యోగం, ఇద్దరు పిల్లలకు 10 లక్షల రూపాయల చొప్పున ఆర్ధిక సహాయాన్ని చేసింది. కొఠారి పబ్లిక్ హెల్త్ సెంటర్ లో డివిజనల్ క్లర్క్ గా ప్రభుత్వం సాజీష్ కు ఉద్యోగం ఇచ్చింది. నెల రోజుల క్రితమే సాజీష్ విధుల్లో చేరాడు. ఇంతలో కేరళ ప్రజలు భారీ వర్షాలతో విపత్తుల్లో చిక్కుకున్నారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ విషాదాన్ని చూసిన సాజీష్ తన మొదటి నెల జీతాన్ని వరద బాధితులకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కార్మిక శాఖ మంత్రి రామకృష్ణన్ కు చెక్ ను అందజేసి సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇవ్వాల్సిందిగా కోరాడు.
లినీ తన భర్తకు రాసిన లేఖ సారాంశం పైన ఉంది
ఇటీవల కేరళలో ప్రాణాంతక నిపా వైరస్ కలకలం రేపింది. దాదాపు 16 మందిని పొట్టన బెట్టుకుంది. ఈ వ్యాధి బారిన పడినవారికి విశేష సేవలందించిన నర్సు లినీ చివరకు వైరస్ సోకి బలైపోయింది. ఈ సంధర్బంగా తన చివరి క్షణాల్లో నర్సు లినీ భర్తకు రాసిన లేఖ కన్నీళ్లు పెట్టించింది. లినీ మరణంపై స్పందించిన కేరళ సర్కార్ ఇచ్చిన మాట ప్రకారం వారికి సహాయం చేసింది. లినీ లాగానే సాజీష్ కూడా సేవా భావం చాటుకోవడంతో అందరి మనసులను గెలుచుకున్నాడు.