ఎన్నారై భర్త ఇంటి ముందు హైదరాబాద్ అమ్మాయి దీక్ష

వరంగల్ లో ఎన్నారై భర్త నుంచి న్యాయం జరగాలంటూ వివాహిత చేపట్టిన దీక్ష ఐదో రోజుకు చేరుకుంది. వరంగల్ లో అత్తింటి ముందు తల్లిదండ్రులతో కలిసి దీక్ష చేస్తోంది దీప్తి. నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్నా అత్తింటివారు పట్టించుకోవట్లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేస్తోంది. లక్షల కట్నం తీసుకుని నాలుగేళ్ల క్రితం ఆమెను పెళ్లి చేసుకున్న భర్త శ్రవణ్ ఇప్పటి వరకూ తనని కాపురానికి తీసుకు వెళ్లనందున ఆమె న్యాయం కోసం పోరాటం చేస్తోంది.

హైదరాబాద్, ఎల్బీ నగర్ కు చెందిన దీప్తికి 2015 లో వరంగల్, హన్మకొండకు చెందిన శ్రవణ్ తో వివాహమైంది. ఆస్ట్రేలియాలో ఉంటున్న శ్రవణ్ ఆమెను కాపురానికి తీసుకెళ్ళకుండా మొహం చాటేశాడు. కొన్ని వేలసార్లు కాల్ చేసినా సరైన స్పందన లేదని, కనీసం అత్తా మామలు కూడా ఆమెను ఇంటికి తీసుకువెళ్లట్లేదని దీప్తి ఆరోపిస్తోంది. సంవత్సరం నుండి కొన్ని వేల కాల్స్, మెసేజెస్ చేశాను అతనికి కానీ రెస్పాన్స్ లేదు. అంతే కాకుండా నా నంబర్ బ్లాక్ చేసేశాడు. నేను వేరే నంబర్ నుండి ట్రై చేస్తే కాల్ కలవట్లేదు. అతని వేరే నంబర్ ఇవ్వమని మా అత్తమామల్ని అడిగితే వీళ్ళు ఇవ్వట్లేదు. పైగా మాకు కూడా నంబర్ తెలియదు, మాతో కూడా మాట్లాడట్లేదు అని చెబుతున్నారు. మేము ఏం చేయాలి? మాకు ఎటువంటి సంబంధం లేదు. మా అబ్బాయి నిన్ను వద్దు అంటున్నాడు, నువ్వు మా ఇంటికి రావొద్దు, మా ఇంటి ముందు ఉండొద్దు అంటున్నారు అత్తమామలు అని దీప్తి తెలిపింది.

నేను ఎప్పుడు మా అత్తగారి ఇంటికి వచ్చినా నాకు ఏదొక సాకు చెప్పి నన్ను మా పుట్టింటికి పంపించేసేవారని, నేను కూడా వారితో వాదించకుండా అర్ధం చేసుకుని వెళ్లిపోయేదాన్నని దీప్తి వివరించింది. రాను రాను వీరి ప్రవర్తనలో తేడా వచ్చింది. అతని కాంటాక్ట్ నంబర్ కూడా నాకు ఇవ్వకుండా, నేను ఇంటికి వస్తే రావద్దని కొట్టి పంపించేశారు. నేను మళ్ళీ వచ్చేసరికి తాళం వేసి వెళ్లిపోయారు. ఐదు రోజుల నుండి నేను ఇక్కడే ఉంటున్నాను. ఈ విషయం వారికి తెలిసింది. వచ్చి మాట్లాడతాం అని చెప్పారు కానీ ఇప్పటి వరకూ రాలేదు. పైగా మేము రాము, ఏం చేసుకుంటావో చేసుకో పో అని బెదిరిస్తున్నారంటూ దీప్తి ఆవేదన వ్యక్తం చేసింది.

గతంలో సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామని, వారు కౌన్సిలింగ్ ఇచ్చారని అయినా అత్తింటి వారిలో మార్పు రాలేదని ఆమె తెలిపింది. అప్పుడు మధ్యవర్తిగా వ్యవహరించిన శ్రవణ్ మేనమామ శ్రవణ్ ఇండియాకి రానంటున్నాడని, నీ లైఫ్ నువ్వు చూసుకోవడం బెటర్ అనడంతో అతను వేరే వివాహం కూడా చేసుకున్నాడేమో అని అనుమానం వస్తుందని తెలిపింది దీప్తి. అతను ఆస్ట్రేలియాలో వేరే అమ్మాయితో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాడని, ఆమెనే వివాహం చేసుకున్నాడేమో అనే అనుమానం వ్యక్తం చేసింది దీప్తి. తనని వెయ్యిమంది సమక్షంలో శ్రవణ్ పెళ్లి చేసుకున్నాడని, నాలుగేళ్లుగా కాపురానికి తీసుకెళ్లకుండా నమ్మకద్రోహం చేశాడని ఆమె ఆవేదనకు గురయ్యింది. నా భర్త శ్రవణ్ ఇండియాకి రావాలని, తన ఇంట్లో ఆమెకు భార్యగా ఉన్న హక్కులు కల్పించాలని, న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేసింది దీప్తి.

మా బిడ్డకు పెళ్లి జరిగి నాలుగేళ్లయింది. అల్లుడు ఏదొకరోజు వస్తాడు, ఇద్దరు కలిసి సంతోషంగా ఉంటారనే ఆశతో వియ్యాలవారు చెప్పినట్టే ఇప్పటి వరకూ నడుచుకున్నాం. ఇప్పుడు మా కొడుకు ఇక రాడు నీ బ్రతుకు నువ్వు చూసుకో అంటూ అత్తింటివారు మాట్లాడుతున్నారని దీప్తి తల్లిదండ్రులు దుఃఖిస్తున్నారు. అల్లుడు ఇండియాకి రావాలని తమ కూతురిని కాపురానికి తీసుకెళ్ళేవరకు కూతురితోపాటు తాము కూడా దీక్ష కొనసాగిస్తామని దీప్తి పేరెంట్స్ చెబుతున్నారు.