విశాఖ మాజీ కార్పోరేటర్ విజయారెడ్డిని హత్య చేసింది వారే

విశాఖ నగరంలో సంచలనం సృష్టించిన మాజీ కౌన్సిలర్ విజయారెడ్డి హత్యకేసు మిస్టరీని పోలీసులు చేధించారు. ఇల్లు కొనుగోలు చేయడానికి వచ్చిన వారే పక్కా వ్యూహంతో ఈ హత్య చేశారని పోలీసుల విచారణలో తేలింది. విజయారెడ్డిని కోలా వెంకట హేమంత్ కుమార్ అనే వ్యక్తి హతమార్చగా నిందితునిగా రాధిక అనే మహిళ సహకరించిందని పోలీసులు నిర్ధారించారు.

విజయారెడ్డి తాను నివాసం ఉంటున్న ఫ్లాట్ ను కోటి 50 లక్షలకు అమ్మకానికి పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న రాధిక, హేమంత్ లు ఆమె దగ్గరికి గత శనివారం వచ్చి ఫ్లాట్ కొంటామని మంతనాలు జరిపారు. అడ్వాన్స్ ఇస్తామని చెప్పి గత సోమవారం హేమంత్ విజయారెడ్డి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో విజయారెడ్డి భర్త ఇంట్లో లేడు. ఆ సమయంలో హేమంత్ ఆమె పై బలత్కారం చేశాడు. ఆ తర్వాత ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడు.

 అనంతరం ఆ ఇంట్లోనే స్నానం చేసి ఆమె భర్త దుస్తులను ధరించి వెళ్లిపోయాడు. దీనికి రాధ సహాయం చేసింది. అనంతరం ఆమె నగలు, కారు, ఫోన్ ను ఎత్తుకెళ్లాడు. దీంతో హేమంత్ , రాధికను నిందితులుగా నిర్ధారించారు. అలకనందా రియల్ ఎస్టేట్ కంపెనీలో హేమంత్ రాధిక సహోద్యోగులు. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని పోలీసులు నిర్దారించారు. జల్సాలకు అలవాటు పడ్డ వీరు డబ్బు కోసం ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు పోలీసు కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు.