ఈ హైద్రాబాద్ ఉడతకు దేశభక్తి ఎక్కువే

ఉడత భక్తి… త్రేతా యుగం నుంచే ఈ పదం ప్రాచుర్యంలో ఉంది. వానరుల సహాయంతో శ్రీరాముడు సముద్రంపై వారధి కడుతున్న వేళ ఇసుకలో పోర్లిన ఉడత ఆ రాళ్ల మధ్య ఇసుకను విదిలిస్తూ వంతెన నిర్మాణానికి తనవంతు సాయం చేసింది. అప్పటి నుంచే ఈ ఉడత భక్తి అనే పదాన్ని అందరూ వాడుతున్నారు. ఉడత భక్తి అనే పదం సామెతగా కూడా వాడకంలో ఉంది.

అయితే ఈ హైదరాబాద్ ఉడత తనలోని దేశభక్తిని చూపించింది. కొందరు చిన్నారులు చిట్టి జెండాలను తాము ఆడుకుంటున్న ప్రాంతంలో ఇసుకలో గుచ్చి వెళ్లారు. పక్కనే ఉన్న చెట్టుపై నుంచి వచ్చిన ఉడత… ఆ జెండా దగ్గరకు వచ్చి దానిని పట్టుకొని వందనం చేసింది. ఈ ఘటన హైదరాబాద్ లోని కొండాపూర్ గౌతమి ఎన్ క్లేవ్ కాలనీలో జరిగింది. జెండా వద్దకు వెళ్లి ఉడత చేసిన విన్యాసాలను పలువురు తిలకించారు. అదే ప్రాంతంలో ఉన్న ఓ ఫోటోగ్రాఫర్ ఆ సీన్ ను క్లిక్ మనిపించారు. ఆ ఫోటో ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతోంది. ఉడత దేశం మీద భక్తి చాటుకుందని పలువురు ముచ్చటపడుతున్నారు. ఉడత భక్తి అనే సామెతను ఈ ఉడత నిజం చేసిందని అంతా అనుకున్నారు.