పూజలందుకున్న పాము ఎలా చనిపోయిందంటే

26 రోజుల పాటు పూజలందుకున్న నాగుపాము మృతి చెందింది. నాగు పాము విషసర్పమే కానీ ఆ పాము ఉన్న చోటు నుంచి కదలలేదు. ప్రజలు దగ్గరికి వెళ్లినా కూడా ఏమి అనలేదు. దీంతో దేవుడే దిగి వచ్చాడని భావించిన ఆ గ్రామ ప్రజలు పాముకు పూజలు చేయడం ప్రారంభించారు. పాలు, పండ్లు పెట్టడం మంత్రోఛ్చరణలతో పూజలు చేశారు. చివరికి ఆపాముకేమైంది, ఇంతకీ ఏ ఊరిలో సంఘటన జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే మరీ

తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో 26 రోజుల క్రితం ఓ రైతు పొలం వద్ద నాగుపాము కనిపించింది. రైతు దానిని చంపేందుకు ప్రయత్నించినా అది కదలకుండా ఉండటంతో అనుమానం వచ్చి ఆగిపోయాడు. అలా ఎన్ని గంటలైనా కదలకపోవడంతో చుట్టపక్కల వారిని పిలిచి చూపించాడు. ఎంత మంది అరిచినా బెదిరించినా అది కదలలేదు. దీంతో ఇది దేవుని మాయ అని పామును ఎవరూ ఏమి అనొద్దని నిర్ణయించుకున్నారు. మనుషులు దగ్గరికి వెళ్లినా కూడా పాము ఏమి అనకపోవడంతో దేవుడు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి రూపంలో దిగి వచ్చాడని పూజలు చేశారు. దాదాపు 26 రోజుల పాటు ఆ పాము పూజలు అందుకుంది. చివరకు అటవీ శాఖాధికారులు, డాక్టర్లు పాము పొడ మీద ఉందని అందుకే అది కదలకుండా ఉందని ఇక దానిని వెళ్లనివ్వాలని అధికారులు చెప్పినా గ్రామస్థులు వినలేదు. అది విష సర్పమని హెచ్చరించినా వారు పట్టించుకోలేదు. అక్కడే ఉన్న నాగుపాము గురువారం సాయంత్రం సమయంలో చనిపోయింది. ఇన్ని రోజులుగా సరైన ఆహారం లేక మరియు 26 రోజుల పాటు ఒకే దగ్గర ఉండటంతో పాము చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు. పసుపు కుంకుమ చల్లటంతో వాటి కాలుష్యానికి కూడా పాము అనారోగ్యానికి గురైందని డాక్టర్లు తెలిపారు.

పూజలందుకున్న నాగుపాము

అయితే పాము చనిపోవడానికి అధికారులే కారణమని దేవుని రూపంలో ఉన్న పామును పట్టించుకోకుండా వెళ్లనివ్వాలని సూచించటం, పామును తరలించేందుకు యత్నించడంతోనే చనిపోయిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. పాము చనిపోయిన చోటనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి నిర్మిస్తామని, శ్రావణ మాసం పూర్తయ్యే లోపు గుడి నిర్మాణం పూర్తి చేస్తామని గ్రామస్థులు అంటున్నారు.26 రోజుల పాటు కదలకుండా, ఎవరిని ఎమనకుండా సంచలనం సృష్టించిన నాగుపాము చనిపోవడంతో అంతా షాక్ కు గురయ్యారు.