హైదరాబాద్‌లో అర్ధరాత్రి రౌడీషీటర్ దారుణ హత్య

హైదరాబాద్ ఎల్బీనగర్ ఫత్తుల్లాగూడా ఆప్కో కాలనీలో ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. భరత్ నగర్ కు చెందిన తంగడడపల్లి రాములుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య విజయలక్ష్మీ కువైట్ లో ఉండగా రెండో భార్య జ్యోతి రాజేంద్రనగర్ లో నివాసముంటోంది. రాములు పలు వివాదాలలో జోక్యం చేసుకొని పలువురిపై దాడులు చేశాడు. ఇద్దరిపై హత్యాయత్నానికి కూడా యత్నించాడు. దీంతో అతనిపై ఎల్ బీ నగర్ లో 5 కేసులు నమోదయ్యాయి. పోలీసులు రాములుపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు.

సాయినగర్ కాలనీకి చెందిన మహిళతో రాములుకు వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయమై చాలా సార్లు గొడవలు కూడా అయ్యాయి. ఇటీవలే ఈ కేసు విషయంలో రాములు జైలుకెళ్లి బయటికొచ్చాడు. విజయలక్ష్మీకి కొడుకు నిఖిల్, జ్యోతికి రాజు, శివాని అనే పిల్లలున్నారు. నిఖిల్ కి వివాహం జరిగింది. వివాదాల నేపథ్యంలోనే రాములు మొదటి భార్య కువైట్ కు వెళ్లగా, రెండో భార్య జ్యోతి రాజేంద్రనగర్ లో ఉంటోంది. రాములు మాత్రం తన పిల్లలతోనే కలిసి భరత్ నగర్ లో ఉంటున్నాడు. పాత కక్ష్యల నేపథ్యంలోనే హత్య జరిగిందా లేక వివాహేతర సంబంధం హత్యకు దారితీసిందా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. తన తండ్రిని అర్ధరాత్రి ఎవరో ఫోన్ చేసి రమ్మంటే వెళ్లాడని నిఖిల్ తెలిపారు. అర్ధరాత్రి వ్యక్తి హత్యకు గురికావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.