జీతాలు చెల్లించకుండా ఉద్యోగులను వేధిస్తున్న కామినేని యాజమాన్యం

వారంతా చిరుద్యోగులు. వారు నెలంతా కష్టపడితే వచ్చే జీతంతోనే వారి బతుకు బండి సాగుతుంది. నెలనాడు జీతం రాలేదో పస్తులుండాల్సిందే. లేకపోతే అప్పో సప్పో చేసి బతుకు బండి లాగాల్సిందే. ఒక్క నెల జీతం రాకుంటేనే అల్లాడిపోతాం. అటువంటిది మూడు నెలల జీతాలు రాకుంటే ఇంకా ఏమైనా ఉందా. అసలు తలుచుకోవడానికే భయంగా ఉంది కదా. అవును మీరు చదివింది నిజం. ఇది ఏదో కంపెనీ అనుకుంటే పొరపాటే. కార్పొరేట్ హాస్పిటల్ అయిన కామినేని హస్పిటల్ లో జరుగుతున్న బాగోతం ఇది.

గత మూడు నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఉద్యోగులను కామినేని యాజమాన్యం కొట్టకుండా తిట్టకుండా వేధింపులకు గురి చేస్తోంది. జీతాలు గురింవి అడిగారా ఖతం వారి ఉద్యోగం ఊడినట్టే లెక్క. ఇంతటి దారుణం కామినేని హాస్పిటల్ లో జరుగుతోంది. కార్మిక చట్టం నిబంధనలను తుంగలో తొక్కి రాజకీయ నాయకుల అండతో కామినేని యాజమాన్యం రాజ్యమేలుతుందని సీఐటియూ నాయకులు అన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఎల్ బీ నగర్  కామినేని హాస్పిటల్ లో దాదాపు కొన్ని వందల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. అడ్మిన్ డిపార్ట్ మెంట్, సెక్రటరీలు, రిసెప్షనిస్టులు, ఆఫీసు బాయ్స్ , అసిస్టెంట్లు, ,ఆపరేటర్లు మరియు ఇతర విభాగాలలో దాదాపు వందల మంది పని చేస్తున్నారు. వీరందరికి కూడా భారత కార్మిక చట్టం ప్రకారం ప్రతినెలా 1 వ తేదిన జీతాలు చెల్లించాలని సీఐటియూ నాయకులు తెలిపారు. కానీ కామినేని యాజమాన్యం వీరికి నెల నెల జీతాలు ఇవ్వకుండా పెండింగ్ లో పెడుతుందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే తతాంగాన్ని యాజమాన్యం నడుపుతుందన్నారు. ఎవరైనా జీతాల గురించి అడిగారో వారిని నిర్ధాక్షిణంగా ఉద్యోగంలో నుంచి తీసేస్తారని తెలుస్తోంది.

 సమయానికి జీతాలు రాక ఉద్యోగులు అరకొర బతుకులు వెళ్లదీస్తున్నారు. పేరుకు కామినేనిలో జాబ్. కానీ కూలీల కన్నా అద్వానంగా తమ బతుకులు ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమప్యను పరిష్కరించి వెంటనే ప్రతినెలా 1 వతేదిన ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని సీఐటియూ నాయకులు కామినేని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. వారంలోగా పూర్తి చెల్లింపులు జరపాలని లేని పక్షంలో ఉద్యమాన్ని చేస్తామని హెచ్చరించారు. అప్పటికి కూడా యాజమాన్యం దిగిరాకపోతే చట్టం ప్రకారం హైకోర్టును ఆశ్రయిస్తామని వారు తెలిపారు.

ప్రస్తుతం కామినేని యాజమాన్యానికి విజయవాడ, నార్కట్ పల్లి, ఎల్ బీ నగర్, కింగ్ కోఠిలలో బ్రాంచ్ లు కలవు. వీటికి ఎండీగా కామినేని శశిధర్ వ్యవహరిస్తున్నారు. నార్కట్ పల్లి మరియు ఎల్ బీనగర్ లలో వీటికి అనుబంధంగా మెడికల్ కళాశాలలు కూడా ఉన్నాయి. దాదాపు అన్ని బ్రాంచ్ లల్లో ఇదే పరిస్థితి నెలకొన్నట్టు తెలుస్తోంది. కామినేని యాజమాన్యం స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.

ఈ విషయం పై తెలుగురాజ్యంతో సిఐటియూ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే…

“ ఈ హైదరాబాద్ లో పైస లేకపోతే పూట గడవడం కష్టం. అటువంటిది మూడు నెలలుగా జీతాలు పెండింగ్ లో ఉన్నాయని వినడానికే బాధగా ఉంది. చిరుద్యోగులు నెలంతా కష్టపడి జీతం కోసం ఎదురు చూస్తారు. అటువంటిది మూడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. ఒక కార్పొరేట్ హాస్పటల్ లో ఈ రకమైన శ్రమ దోపిడి జరగడం నేరం. కార్మిక చట్టాల ప్రకారం ఉద్యోగులకు విధిగా ప్రతి నెల 1 వ తేదిన జీతాలు చెల్లించాలి.

అలాగే కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం కనీస వేతనం రూ. 18 వేలుగా ఇవ్వాలి. కానీ వాటిని పాటించకుండా 8, 10 వేలతో ఉద్యోగులతో పని చేయిస్తున్నారు. కామినేని యాజమాన్యం వెంటనే స్పందించి పెండింగ్ లో ఉన్న జీతాలు వారంలోగా చెల్లించాలి. లేకపోతే ఉద్యమాన్ని చేయాల్సి వస్తుంది. అప్పటికి కూడా యాజమాన్యం దిగి రాకపోతే చట్టం ప్రకారం మా పని మేం చేస్తాం. హైకోర్టులో పిటిషన్ వేసి ఆస్పత్రి పై చర్యలకు సిఫార్సు చేస్తాం. 

భూపాల్, తెలంగాణ రాష్ట్ర సిఐటియూ ఉపాధ్యక్షులు మరియు మినిమం వేజ్ అడ్వైజరీ బోర్డు సభ్యులు

కొంత మంది రాజకీయ నాయకుల అండతో ఈ విధంగా చేస్తున్నారు. ఉద్యోగుల జీతాలతో రాజకీయాలు చేస్రారా. ఇదేనా యాజమాన్య వైఖరి. యాజమాన్యం వెంటనే తన వైఖరి మార్చుకోవాలి. కార్మిక చట్టం నిబంధనలు అమలు చేయాలి.”  అని భూపాల్ అన్నారు.