గుండెలను పిండేసిన జవాను బిడ్డ మాటలు

గుండెల నిండా దేశ గాలి పీల్చి జెండాకు సెల్యూట్ చేయాల్సిన ఆ హృదయాలపై జాతీయ పతాకం కప్పాల్సి వచ్చింది. కళ్ల ముందే సిబ్బంది కుప్పకూలిపోతున్నా ఏం చేయాలో తెలియని పరిస్థితిలో తోటి జవాన్లు ఉండిపోయారు. స్వాతంత్ర్య దినోత్సవం సంధర్బంగా ఒంగోలు ఎన్ సీసీ బెటాలియన్ లో ఏర్పాట్లు చేస్తున్న సైనికులు బసంత్ రాణా, అప్పల నాయుడు షాక్ కు గురై మరణించిన సంగతి తెలిసిందే.

జెండాను ఎగరేసి ఆనందంగా ఉండాల్సిన వారంతా రిమ్స్ హాస్పిటల్ ముందు ఉండాల్సి వచ్చింది. జెండాను కట్టేందుకు ఏర్పాట్లు చేస్తుండగా బసంత్ రాణా, అప్పలనాయుడు జెండా పోల్ ను సిద్దం చేస్తున్నారు. ఈ క్రమంలో పోల్ కు తాడు కట్టి పైన నిలిపేందుకు ప్రయత్నించారు. పోల్ పై భాగంలోనే విద్యుత్ తీగలు ఉన్నాయి. వాటికి తగలకుండా జాగ్రత్తలు తీసుకున్న వర్షం కారణంగా ఎర్త్ వచ్చి వారిద్దరు షాక్ కు గురయ్యారు. సహచర ఉద్యోగులు చూసి వారిని కాపాడే ప్రయత్నం చేసినా జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. బసంత్ రాణా నేపాల్ కు చెందిన వారు కాగా, అప్పల నాయుడు శ్రీకాకుళంకు చెందినవాడు.

అప్పల నాయుడుకి భార్య, ఒక ఆరేళ్ల కూతురు ఉన్నారు. భార్య ప్రస్తుతం గర్భవతి. అప్పల నాయుడు ప్రమాదానికి గురైన విషయాన్ని ఆమెకు తెలియకుండా ఆర్మీ అధికారులు, బంధువులు దాచారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడని చెప్పి ఆమెను తీసుకుపోగా జరిగిన ఘోరం తెలుసుకొని కుప్పకూలింది. ఓ వైపు తన కూతురుని చూస్తూ మరో వైపు తన కడుపులో ఉన్న బిడ్డను అదిమి పట్టకొని ఏడ్చింది. ఆమెను ఓదార్చడం ఎవరీ తరం కాలేదు. అప్పలనాయుడు కుమార్తె తండ్రి తలభాగం వద్ద దండం పెట్టుకొని కన్నీటి పర్యంతం అయ్యింది.

పాపను మహిళా క్యాడెట్లు దూరం తీసుకెళుతుండగా ఆ పాప  ”  డాడీ… రా డాడీ … డాడీ ఒక్కసారీ లే డాడీ .. నాతో మాట్లాడు డాడీ “ అంటూ ఆ పాప భోరున ఏడ్చేసింది. ఆ చిన్నారి మాటలు అక్కడున్న వారి హృదయాలను కలిచివేసింది. అక్కడున్న వారంతా ఆ చిన్నారి ఆక్రందనలతో శోక సంద్రంలో మునిగిపోయారు.  అనంతరం అప్పలనాయుడు మృతదేహాన్ని శ్రీకాకుళం తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. బసంత్ రాణా మృతదేహాన్ని నేపాల్ పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

గుండెలవిసేలా విలపిస్తున్న అప్పలనాయుడు కుమార్తె, ఇన్ సెట్ లో అప్పలనాయుడు, బసంత్ రాణా