ధూల్‌పేట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పై దాడి, తీవ్ర ఉద్రిక్తత

హైదరాబాద్ ధూల్ పేట ఎక్సైజ్  పోలీస్ స్టేషన్  వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. గుడుంబా గంజాయి వ్యాపారులు కొందరు స్టేషన్ పై దాడికి పాల్పడ్డారు. మంగళహాట్ ప్రాంతంలో గంజాయి అమ్ముతుండగా ఎక్సైజ్ పోలీసులు బుధవారం తల్లి కొడుకులను అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరిని విడిపించుకొని తీసుకెళ్లేందుకు స్టేషన్ కు వచ్చిన వారి బంధువులు స్టేషన్ పై దాడి చేశారు. విధుల్లో ఉన్న అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ నవీన్‌ కుమార్‌, సీఐపై వారు చేయి చేసుకున్నట్టు తెలుస్తోంది.

ధూల్ పేటకు చెందిన ఆర్తిబాయి , ఆమె కొడుకు ఉద్దేశ్ సింగ్ గంజాయి విక్రయం కేసులో గతంలోనూ అరెస్టయి జైలు శిక్ష అనుభవించారు. ఆ తర్వాత బయటకు వచ్చినప్పటికి వారిలో ఏ మాత్రం మార్పు రాలేదు. గంజాయి విక్రయాన్ని వృత్తిగా ఎంచుకొని జీవిస్తున్నారు. బుధవారం నాడు కూడా గంజాయి అమ్ముతూ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డారు.

గొడవ పడుతున్న బంధువులు

వీరిద్దరి పై కేసు నమోదు చేసి వారిని రిమాండ్ కు తరలించేందుకు సిద్దమవుతున్న సమయంలో నిందితుల బంధువులు ఒక్కసారిగా స్టేషన్  కు వచ్చారు. వారి పై కేసులు నమోదు చేయకుండా వదిలి వేయాలని కోరారు.

గతంలో కేసు నమోదు అయినా వీరిలో మార్పు రాలేదని చెప్పగా సిబ్బందితో వాగ్వాదానికి దిగి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్, సీఐ పై దాడి చేసి వారిని తీసుకొని వెళ్లారు. ఈ ఘటన పై మంగళ హాట్ పోలీసులకు సీఐ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.