యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కురు మండలంలో ఉద్రిక్తత నెలకొంది. మోత్కురు మండల కేంద్రంలో దత్తప్పగూడెం గ్రామానికి చెందిన నలుగురు రైతులు టవరెక్కారు. తాము కొనుగోలు చేసిన పత్తి విత్తనాలను పంట వేస్తే ఇప్పటి వరకు అవి కాయ, పూత లేకుండా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేసిన వీడియో కింద ఉంది చూడండి.
తాము నకిలీ విత్తనాలు వేసి నష్టపోయామని గ్రహించిన రైతులు మంగళవారం ఉదయం మోత్కూరు మండల కేంద్రంలోని సెల్ టవర్ ఎక్కారు. పురుగుల మందు డబ్బాలు, పెట్రోల్ బాటిల్ లు రైతుల వద్ద ఉన్నాయి. తమకు న్యాయం చేయాలని లేని పక్షంలో ఆత్మహత్య చేసుకుంటామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తాము పేద కుటుంబాలకు చెందిన వారిమని కష్టం చేసుకుంటేనే తమ పూట గడుస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి పంట వేశామని పంట నాశనమైతే తమ బతుకులేంటని తమకు చావే దిక్కని రైతులు నిరసన తెలిపారు.
రైతుల ఆందోళనతో మోత్కూర్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు, రెవిన్యూ అధికారులు, స్థానికులు రైతులకు నచ్చచెప్పినా వినకుండా తమకు న్యాయం జరిగేంత వరకు టవర్ దిగేది లేదని వారంటున్నారు. కలెక్టర్ వచ్చి హామీ ఇస్తేనే తాము కిందకు దిగుతామని రైతులు డిమాండ్ చేస్తుండటంతో మోత్కూరులో ఉద్రిక్తత ఏర్పడింది. రైతుల ఆందోళనతో గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.