పది నిమిషాలు లేటుగా వచ్చిందని భార్యకు విడాకులు ఇచ్చాడు

ట్రిపుల్ తలాక్ నేరమని కేంద్రం, సుప్రీం కోర్టులు చెప్పినా మనుషులు వినడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఏకంగా బిల్లు తీసుకొచ్చినా మార్పురావడం లేదు. భార్య 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చిందని ఏకంగా భార్యకు విడాకులు ఇచ్చాడు ఓ దుర్మార్గుడు. ఉత్తర ప్రదేశ్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

బాధితురాలు జబ్బుచేసి ఉన్న తన నానమ్మను చూడ్డానికి పుట్టింటికి వెళ్లింది. వెళ్లే ముందు భర్త సరిగా అర్ధగంటలో ఇంట్లో ఉండాలని హెచ్చరించాడు. అయితే భర్త చెప్పిన టైం కాన్న ఓ పది నిమిషాలు ఆలస్యంగా ఇంటికి వచ్చింది బాధితురాలు.

దాంతో బాధితురాలి భర్త ఆమె సోదరునికి ఫోన్‌ చేసి మూడుసార్లు తలాక్‌ అని చెప్పి ఫోన్‌ పెట్టేశాడు. భర్త నిర్వకం తెలుసుకున్న బాధితురాలు తన కుటుంబసభ్యులను తీసుకుని అత్తారింటికి వస్తే ఆమె మీద దాడి చేసి ఇంట్లో నుంచి గెంటేశారు. దీంతో బాధితురాలు తన భర్త, అతని కుటుంబసభ్యుల మీద పోలీస్ కేసు పెట్టింది. పోలీసులు విచారణ మొదలుపెట్టారు.

బాధితురాలు మాట్లాడుతూ.. తనకు న్యాయం చేయాలని లేకపోతే.. ఆత్మహత్యే దిక్కని బాధపడుతుంది. అంతేకాక పెళ్లైన నాటి నుంచి అత్తింటివారు తనను కట్నం కోసం వేధిస్తున్నారని తెలిపింది. తన తల్లిదండ్రులు చాలా పేదవారిని కట్నం ఇచ్చుకోలేరని చెప్పినా వినిపించుకోవడం లేదని వాపోయింది. కట్నం కోసం తనను కొట్టడమే కాక.. ఇప్పటికే ఒక సారి ఆబార్షన్‌ కూడా చేయించారని తెలిపింది. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని కోరింది.