చెన్నైలో దారుణం.. రోడ్డు ప్రమాదంలో సబ్‌ఇన్‌స్పెక్టర్‌ మృతి..!

ఈ మధ్య కాలంలో రోడ్ యాక్సిడెంట్లు విపరీతంగా పెరిగిపోయాయి. రోడ్డు మీద వెళ్తున్న వాహనదారులు ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా కూడా ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతిరోజు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల చెన్నై లో ఇటువంటి దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో SI మృతి చెందాడు.

వివరాల్లోకి వెళితే … తమిళనాడు , కాంచీపురం జిల్లా సుంకువారిసత్రం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న తిరుమురుగన్ (59), కాంచీపురం లోని వెళ్ళంగపట్టరై ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ప్రతి రోజు ద్విచక్ర వాహనం మీద డ్యూటీకి వెళ్లి వస్తుండేవారు.

మంగళవారం ఉదయం బైక్ మీద డ్యూటీకి వెళ్తున్న తిరుమురుగన్ మృత్యువు లారీ రూపంలో కబలించింది. తిరుమురుగన్ చిన్నయప్పన్ సత్రం సమీపంలోకి వెళ్ళగానే వెనుక వైపు నుండి వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి తిరుమురుగన్ వెళ్తున్న బైక్ ని ఢీ కొనడంతో తిరుమురుగన్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ సమాచారాన్ని స్థానికులు పోలీసులకు తెలియచేశారు.

సమచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి ప్రమాదం గురించి స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత తిరుమురుగన్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం ఆయన స్వస్థలమైన దిండుగల్ జిల్లా శివగిరిపట్టికి తరలించారు. మృతునికి భార్య పాండి సెల్వి, ఇద్దరు కుమారులు అశోక్ కుమార్, ఆనంద్ లు ఉన్నారు.