శంషాబాద్ ఎయిర్ పోర్టులో తప్పిన ఘోర ప్రమాదం

శంషాబాద్ విమానాశ్రయంలో ఘోర  ప్రమాదం తప్పింది. జజీరా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది, పైలట్ సకాలంలో స్పందించడంతో పెనుప్రమాదం తప్పింది. జజీరా ఎయిర్ లైన్స్ విమానం కువైట్ నుంచి హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టుకు గురువారం ఉదయం 1.33గంటలకు చేరుకుంది. విమానం కిందకు ల్యాండ్ అవుతుండగానే విమానం ఇంజన్  నుంచి మంటలు వచ్చాయి. దీనిని గమనించిన పైలట్ అలర్టయ్యి విమానాన్ని సకాలంలో నిలిపేశాడు. ఎయిర్ పోర్టులో ఉన్న అగ్ని మాపక సిబ్బంది క్షణాల్లో మంటలు ఆర్పగా ప్రయాణికులు కిందకు దిగిపోయారు. విమానంలో 150 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సాంకేతిక కారణాలతోనే ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు అధికారులు రంగంలోకి దిగారు.