బ్రిడ్జి పై నుంచి బోల్తాపడిన ఆర్టీసీ బస్సు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. బూర్గంపాడు మండలం రెడ్డిపాలెంలో ఆర్టీసీ బస్సు బ్రిడ్జిపై నుంచి బోల్తా పడింది. బస్సు ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో పది మందికి తీవ్రగాయాలైనట్టు తెలుస్తోంది. గాయపడ్డవారిని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.

ఉదయం నుంచి కురుస్తోన్న వర్షం కారణంగా ఏర్పడిన గుంతలను తప్పించబోయి బస్సు అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి కిందపడింది. భద్రాచలం నుంచి విజయవాడకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు ప్రమాదం జరగగానే బస్సులో ఉన్న వారంతా భయభ్రాంతులకు గురయ్యి కేకలు వేశారు. గాయపడ్డవారు, బస్సులో ఉన్న వారి రోధనలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.