ఎన్టీఆర్ తండ్రి కూడా రోడ్డు యాక్సిడెంట్ లోనే చనిపోయారు

హైదరాబాద్ లో సినీ పరిశ్రమ అప్పుడప్పుడే వేళ్లూనుకుంటున్న వేళ, రామకృష్ణా స్టూడియోను కట్టడం ప్రారంభించిన ఎన్టీ రామారావు దాని బాధ్యతలు చూసుకునేందుకు హరికృష్ణను హైదరాబాద్ కు రప్పించారు. ఈ విషయాన్ని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్న ఆయన, తనకు హైదరాబాద్ రావడం ఇష్టం లేదని అదే మాట తండ్రికి చెబితే నువ్వుంటావనే భావనతోనే స్టూడియో కట్టాను. రావాల్సిందే అనడంతో తప్పక వచ్చానని అన్నారు.

తాతయ్య లక్ష్మయ్య చౌదరి కూడా నీతోనే ఉంటారని చెప్పడంతో కాదనలేక పోయానని హరికృష్ణ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఆ తరువాత శంషాబాద్ సమీపంలో తమకున్న పొలం వద్దకు వెళ్లి వస్తున్న తాతయ్య రాజేంద్రనగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారని చెప్పారు. ఈ ప్రమాదంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఎన్టీఆర్, తండ్రిని బలిగొన్న పొలం ఇక మనకు వద్దని అంటూ 250 ఎకరాల భూమిని అమ్మేశారని వివరించారు. తన తాతయ్యలానే హరికృష్ణ, అతని కుమారుడు జానకీరామ్ కూడా యాక్సిడెంట్ లోనే మరణించడం యాదృచ్చికం. ఎన్టీఆర్ ఫ్యామిలీలను గతం నుంచే రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయని అభిమానులు ఆవేదన చెందుతున్నారు.