అమ్మ ప్రేమ    (రియల్ స్టోరీ )

                  ( రచయిత- నన్నూరి శ్రీకాంత్ రెడ్డి)

ఎన్నెన్నో కలలు ఏదో చేయాలి ఏదో సాధించాలనే తపనతో కష్టపడని రోజు  లేదు. ఏ పని చేసినా చేదు అనుభవం.. కోపం, బాధా నన్ను బాధించాయి. ఈ కష్టాల నుంచి ఎలా బయటపడాలి దేవుడా అందరిని ఓకేలా పుట్టించవని అనుకోని రోజు లేదు.

మాది ఒక్క చిన్న గ్రామం. మేము నిరుపేద కుటుంబానికి చెందిన వారం. నాన్న, అమ్మ,అన్నయ్య, నేను. చిన్న కుటుంబం మాది. చిన్న కుటుంబం అయినా ఉన్నంతలో సంతోషంగా ఉండేవారం. అమ్మానాన్న వ్యవసాయం చేస్తుండేవారు. వారి అనురాగ ఆప్యాయతలతో ఆనందంగా మా జీవితం సాగుతుంది.

ఉన్నట్టుండి మా జీవితంలో పిడుగులాంటి వార్త విషాదాన్ని నింపింది. నాన్న  ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. మా జీవితాలలో చీకట్లు కమ్ముకున్నాయి. అప్పటి నుంచి అమ్మ కష్టపడుతూ ఏ లోటూ లేకుండా మమ్ముల్ల పెంచి పెద్ద చేసింది. తనకెంత బాధ ఉన్నా ఆమె దిగమింగుకొని మాకు సంతోషాన్ని పంచింది. అన్న ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వెళ్లాడు. నేను అమ్మతో కలిసి ఉండేవాడిని. అన్న అవసరానికి కాలేజి ఫీజు, వసతికి అమ్మ కష్ట పడి డబ్బు పంపేది. అన్న కష్టపడి చదివి క్యాంపస్ ప్లేస్  మెంట్స్ లో ఉన్నతోద్యోగం సాధించాడు. అమ్మ ఆనందానికి అవదులు లేవు. ఇన్ని రోజులు పడ్డ కష్టానికి ఫలితం దక్కిందని మురిసిపోయి ఇన్ని రోజులు పడ్డ కష్టాన్ని మరిచిపోయింది.

 మా జీవితంలో మంచి రోజులు వచ్చాయని చాలా సంతోషించాం. కానీ దేవుడికి సంతోషించే వాళ్లంటే నచ్చదేమో. మళ్లీ మా జీవితంలోకి విషాదాన్ని చెప్పాడు. అన్న ఉద్యోగం చేస్తూ, నేను కష్టపడి చదువుతూ ఆనందంగా ఉండే వాళ్లం. ఉన్నట్టుండి మా అన్న జీవితంలోకి ఒక అమ్మాయి వచ్చి మా జీవితాలను తలకిందులు చేసింది. అన్న ఉద్యోగం చేసే కంపెనీలో అన్న తో కలిసి చదువుకున్న అమ్మాయి పరిచయమైందట. ఆ పరిచయం కాస్త వారు అమ్మతో చెప్పకుండా పెళ్లి చేసుకునే వరకు వచ్చింది. పెళ్లి చేసుకునే ముందు కూడా అమ్మ గుర్తుకు రాలేదు. అమ్మాయి వాళ్ల ఇంట్లో ఆ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో చేసేది లేక తిరిగి అమ్మ  దగ్గరకు వచ్చారు. అమ్మ కొడుకు పెళ్లి కోసం ఎన్నో కలలు కన్నది. ఆ బాధను దింగమింగుకొని సంతోషంగా కొడుకును కోడలును సంతోషంగా ఆహ్వానించింది. కోడల్ని తన సొంత కూతురిలా చూసుకుంది.

ఆ అమ్మాయి మొదట్లో సంతోషంగా ఉన్నా తర్వాత ఆ అమ్మాయి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టింది. జరుగుతున్న పరిణామాల రీత్య అన్న అమ్మతో మాట్లాడటం తక్కువ చేశాడు. అమ్మ లోలోపల కుమిలిపోతున్నా పైకి మాత్రం చిరునవ్వులు చిందిస్తుంది. ఇంట్లో జరుగుతున్న పరిణామాలతో అన్న వేరొక ఇంటికి వెళ్లి పోయాడు. అమ్మా ఎంత చెప్పినా వినలేదు. కనీ పెంచి కష్టపడి చదివించిన తల్లి ప్రేమ ముందు అమ్మాయి ప్రేమే గెలిచింది. అమ్మ బాధను చూసి ఆమె ఎలా కోలుకుంటుందో అని బాధపడ్డాను. అన్నయ్య మాత్రం అమ్మ గురించి ఆలోచించలేదు. ఇంతలోనే అన్నయ్యకు ప్రమాదంలో రెండు కాళ్లు పోయాయి. దాంతో అన్న జాబ్ పోయింది. ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి అన్నను వదిలి పుట్టింటికి  పోయింది. అప్పుడు అన్నయ్య తనెంత పెద్ద తప్పు చేశాడో తెలుసుకున్నాడు. అన్నకి జాబ్ పోవడంతో మళ్లి మాకు కష్టాలు మొదలయ్యాయి. నేను ఉద్యోగాల కోసం తిరగని ఆఫీసు లేదు. అమ్మ అన్నని జాగ్రత్తగా చూసుకుంది. అన్న వైద్యం కోసం అమ్మ ఉన్న ఇంటిని అమ్మింది. అన్నయ్యకు కృతిమ కాళ్లు అమర్చారు. నాకు కూడా ఉద్యోగం లభించింది. ఇప్పుడు మా కుటుంబం బాగుంది.

మారుతున్న సమాజంలో అమ్మాయి ప్రేమకు కేటాయించే సమయం అమ్మ ప్రేమకు కేటాయిస్తే అమ్మ విలువ తెలుస్తుంది. ప్రతి కొడుకు గొప్పగా ఉండాలని కోరుకునే వారిలో మొదటి వ్యక్తి అమ్మ. బిడ్డల కోసం ఏదైనా చేయగలిగే ఏకైక వ్యక్తి అమ్మ. ప్రేమించోద్దని చెప్పట్లేదు. అర్ధం చేసుకునే అమ్మాయిని ప్రేమించి అర్ధవంతమైన జీవితం సాగించాలని కోరుకుంటున్నాను. ప్రేమ విఫలమైనా జీవితం అంతా అయిపోయిందనుకోవద్దు అంత కంటే మంచి జీవితం మనకు ఉంటుంది. మనల్ని ప్రేమించే కుటుంబం కోసం కూడా ఆలోచించి జీవితాలను కొనసాగించాలనుకుంటున్నాను.

 

                            (నన్నూరి శ్రీకాంత్ రెడ్డి )