రాజమండ్రిలో భారీ పేలుడు

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని లాలా నగర్ లో శనివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో నలుగురికి  తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇంట్లో బాణా సంచా తయారు చేస్తుండగా షాట్ సర్క్యూట్ తో గ్యాస్ కు మంటలు అంటుకొని ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

ప్రమాద దృశ్యాలు
ప్రమాదంలో గాయపడ్డ చిన్నారి

దేవాడ ముత్యాల రెడ్డి ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇతని కుటుంబం ప్రతి సంవత్సరం దీపావళి కోసం టపాసులు తయారు చేస్తారు. ఈ సారి కూడా టపాసులు తయారు చేస్తుండగా ఒక్క సారిగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముత్యాల రెడ్డికి గాయాలు కాగా అతడి తల్లి దేవాడ ధనలక్ష్మీ, భార్య సూర్యకాంతం మరణించారు. మేనకోడలు కర్రి వైష్ణవి (9), తమ్ముళ్లు వినయ్ రెడ్డి, దుర్గామణికుమార్ లకు 90 శాతానికి పైగా గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. 

వీరిని రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో రాజమండ్రిలో విషాద చాయలు అలుముకున్నాయి.