పెళ్లి చేసుకుంటానని స్టూడెంట్ తో సహజీవనం చేసిన ఇఫ్లూ ప్రొఫెసర్

విద్యార్ధినికి విద్యాబుద్దులు చెప్పాల్సిన ప్రొఫెసర్ పక్క దారి పట్టాడు. మాయ మాటలు చెప్పి ఆమెన లోబర్చుకొని ఆమెతో సహజీవనం చేశాడు. పెళ్లి చేసుకోవాలని నిలదీస్తే ముఖం చాటేశాడు. దీంతో తనకు న్యాయం చేయాలని ఆ విద్యార్ధిని పోలీసులను ఆశ్రయించింది.

కేరళకు చెందిన విద్యార్ధిని తార్నాకలోని ఇఫ్లూలో ఎం.ఏ ఇంగ్లీషు చదువుతోంది. కేరళకు చెందిన రంజిత్ తంగప్పన్ ఇప్లూలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నాడు. ఇద్దరిది ఒకే రాష్ట్రం కావడంతో వీరి మధ్య పరిచయం ఏర్పడింది.  ఇతను సీతాఫల్ మండిలో రూం తీసుకొని ఉంటున్నాడు. తంగప్పన్ కి పెళ్లి అయ్యి పిల్లలు కూడా ఉన్నారు. భార్యతో విబేధాల కారణంగా ఆమెకు దూరంగా ఉంటున్నాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. భార్యకు విడాకులు ఇప్పించి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అలా విద్యార్ధినిని శారీరకంగా లొంగదీసుకున్నాడు.

కొన్నాళ్లు చాటు మాటు వ్యవహారం నడిచినా విద్యార్ధినిని హాస్టల్ ఖాళీ చేయించి తన రూముకు తీసుకెళ్లాడు. గత 6 నెలలుగా రూంలో ఉంటూ సహజీవనం చేస్తున్నారు. తనను పెళ్లి చేసుకోవాలని ఆ అమ్మాయి రంజిత్ పై ఒత్తిడి తెస్తుంది. దీంతో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. ఈ నెల 12 న వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

పెళ్లి చేసుకోవడం కుదరదని, హాస్టల్ కు వెళ్లి పోవాలని ఇంట్లో నుంచి గెంటేశాడు. ఇంటికి తాళం వేసుకొని ఎటో వెళ్లి పోయాడు. ఆమె ఫోన్ నంబర్ ను బ్లాక్ లిస్టులో పెట్టాడు. హాస్టల్ కి వచ్చిన అమ్మాయి రంజిత్ కోసం యూనివర్సిటిలో సంప్రదించింది. అతను ఈ నెల 19 నుంచి సెలవులు పెట్టి కేరళకు వెళ్లిపోయినట్టుగా తెలిసింది. దీంతో దిక్కుతోచని అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.