బెజవాడలో మరో పరువు హత్య: కలకలం రేపుతున్న పోస్టర్లు

 

కొన్ని రోజులుగా “పరువు” అనే పదం వింటేనే ప్రేమికుల వెన్నులో వణుకు పుడుతోంది. అసలు ఈ “పరువు” అనే పదం తెలుగు డిక్షనరీలో లేకపోతే బావుండు అనుకుంటున్నారు సామాన్య జనం. పరువు పేరిట కొన్ని రోజుల నుండి ప్రేమికులపై వరుస దాడులు జరుగుతున్నాయి. పరువు కోసం ప్రాణాలు సైతం తీయడానికైనా, తీసేయడానికైనా వెనుకాడని దౌర్భాగ్య స్థితిలో ఉంది దేశం. అందునా తెలుగు రాష్ట్రాల్లో పరువు మహమ్మారి స్వైర విహారం చేస్తోంది.

ఇప్పుడు బెజవాడలో మరో పరువు హత్య జరగనుందట. షాకింగ్ గా ఉంది కదూ… ఇప్పుడు బెజవాడ వాసులను ఈ వార్త కలవరపెడుతోంది. పరువు హత్యకు గురి కానున్న “సోని రాహు ప్రియ” అని పోస్టర్లు విజయవాడలో గోడలపై అతికించారు. ఈ పోస్టర్లు రాజధానిలో కలకలం రేపుతున్నాయి.

బెజవాడ సత్యనారాయణపురం, శివాలయం వీధి నిండా ఈ పోస్టర్లు అతికించబడ్డాయి. ఈ పోస్టర్లు చూసిన స్థానికులు కొద్దిసేపు ఖంగు తిన్నారు. భయపెట్టే ఉద్దేశ్యంతోనే ఎవరో ఆకతాయిలు ఇలా చేసి ఉంటారని భావించారు స్థానికులు. కానీ ముందుజాగ్రత్తగా పోలీసులకు సమాచారం అందించారు.

దీనిపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు. కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాల రీత్యా ఈ విషయాన్నీ సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు. ఆకతాయిల పనా లేక నిజంగానే ఇలాంటి పరువు హత్యకు ఎవరైనా ప్లాన్ వేశారా లేక సదరు ప్రేమికులను భయపెట్టేందుకు ఇలా చేసారా అనే కోణంలో కేసును పరిశీలిస్తున్నారు. ముందు పోస్టర్లలో ముద్రించబడిన ఆ “సోని రాహు ప్రియ” ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.

మిర్యాలగూడలో ప్రేమ వివాహం చేసుకున్నారని అమృత తండ్రి మారుతీరావు ప్రణయ్ ని హత్య చేయించాడు. సనత్ నగర్ లో ఒక నరసింహాచారి ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు కూతురు, అల్లుడిపై క్రూరంగా దాడి చేసాడు. కడప జిల్లాకు చెందిన దీప్తి రెడ్డి, విజయ్ ప్రేమ వివాహం చేసుకున్నందుకు దీప్తి తల్లిదండ్రులు విజయ్ ని హతమారుస్తారేమో అని భయపడి విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి గోడు వెళ్లబోసుకున్నారు. కూతురిని ప్రేమిస్తున్నాడని నాగసాయిని, అతని స్నేహితుడిని అమ్మాయి తల్లిదండ్రులు విజయవాడలో కిడ్నాప్ చేశారు.

ఈ దారుణాలన్నిటికీ కారణం “పరువు”. ఈ ప్రపంచంలో అత్యంత ప్రేమాస్వరూపులు ఎవరు అని అడిగితే ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు అని చెబుతుంటారు. మరి అలాంటివారు బిడ్డల ప్రేమవ్యవహారం తెలియగానే కర్కశంగా మారిపోవడానికి కారణం “పరువు”. ఈ “పరువు” మహమ్మారికి చరమగీతం పాడే రోజులు ఎప్పుడు వస్తాయో?