మిర్యాలగూడలో దారుణ హత్యకు గురైన ప్రణయ్ హత్య కేసులో నిందితులు మారుతీరావు, శ్రావణ్ కుమార్ లతో పాటు మహ్మద్ అబ్దుల్ కరీంలపై పోలీసులు పిడి యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. వీరి పై గతంలో బెదిరింపులు, హత్యా ఆరోపణలు నిజం కావడంతో పోలీసులు వారి పై పిడి యాక్ట్ నమోదు చేశారు. ఇప్పటి వరకు నల్లగొండ జైలులో ఉన్న వీరిని పిడి యాక్ట్ నమోదు కావడంతో వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు.
మిర్యాలగూడలో ప్రణయ్ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. కూతురు ప్రేమ వివాహం చేసుకుందని అమృత తండ్రి ప్రణయ్ ని దారుణంగా హత్య చేయించాడు. ప్రస్తుతం అమృత 6 నెలల గర్భవతి. దళిత యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కోపంతో మారుతీరావు తన అల్లుడిని చంపించాడు.
మారుతీరావు గతంలో రియల్టర్ గా పనిచేశాడు. ఆ సమయంలో అతను అనేక మందిని బెదిరించాడని అతని పై ఆరోపణలు ఉన్నాయి. పలు హత్య కేసులలో కూడా మారుతీరావు హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే మారుతీరావు తమ్ముడు శ్రావణ్ కుమార్ కూడా నేర చరిత కలిగినవాడేనని ఆరోపణలు ఉన్నాయి.
తన తండ్రి, బాబాయ్ ల గురించి అమృత సంచలన విషయాలను వెల్లడించింది. తన తండ్రి మాదిరే బాబాయ్ కూడా నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తి అని చెప్పింది. బాబాయ్ కి వివాహేతర సంబంధాలు కూడా ఉన్నాయని… ఆయన కొడుకు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. ఆ విషయాన్ని బాబాయ్ కి చెబితే… అబ్బాయిలు అలాగే ఉంటారు, నీవు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడని వెల్లడించింది. ఈ ఘటన జరిగినప్పుడు తాను బీటెక్ చదువుతున్నానని, బాబాయ్ కొడుకు 8వ తరగతి చదువుతున్నాడని చెప్పింది.
బాబాయ్ కొడుకు పోర్న్ వీడియోలు చూస్తున్నాడని అతని తల్లికి చెబితే… వాటిని చూడకపోతే అబ్బాయి అని ఎలా అనిపించుకుంటాడు? అంటూ వెనకేసుకొచ్చిందని అమృత తెలిపింది. ఒక తల్లి ఇలాంటి వాటిని వెనకేసుకు రావడం సమంజసమేనా? అని ప్రశ్నించింది. తనతో పాటు తమ బంధువులలో ఉన్న చాలా మంది అమ్మాయిలతో బాబాయ్ కొడుకు ఇలాగే ప్రవర్తించాడని చెప్పింది.
శ్రావణ్ కుమార్ అమ్మాయిలతో పోర్న్ వీడియోలు తీశాడనే ఆరోపణలు ఉన్నాయి. మిర్యాలగూడ గుట్టలలో తండాల నుంచి అమ్మాయిలను, మహిళలను తీసుకొచ్చి పోర్న్ వీడియోలు తీసి వాటిని వెబ్ సైట్ లలో పెట్టేవారని పలువురు పోలీసులకు చెప్పారు. ఓ సారి గుట్టలల్లో వీడియోలు తీస్తుంటే పట్టుకోవడంతో మిర్యాలగూడ వదిలి వెళతానని చెప్పి తప్పించుకున్నాడు. సంవత్సరం పాటు మిర్యాలగూడకు దూరంగా ఉండి మళ్లీ వచ్చి మిర్యాలగూడలో చేరాడు.
వీటన్నింటిని పరిశీలించిన పోలీసులు మారుతీరావు, శ్రావణ్ కుమర్ , కరీంల పై పిడి యాక్ట్ నమోదు చేశారు. నిందితులను ఉరి తీయాలని అమృత డిమాండ్ చేసింది.