ప్రతిరోజు దేశంలో ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు. అనారోగ్య సమస్యల వల్ల మరణించే వారు కొందరైతే రోడ్డు ప్రమాదాల వల్ల మరణించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దేశంలో ప్రతిరోజు వందల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపుతున్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల తల్లిదండ్రులు మరణించి ఎంతోమంది పిల్లలు అనాధలుగా మారుతున్నారు. ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో భర్త మరణించగా భార్య తీవ్ర గాయాలపాలెం ప్రాణాలతో పోరాడుతోంది.
వివరాలలోకి వెళితే…ఆత్మకూర్ (ఎస్) గ్రామానికి చెందిన ముల్కలపెల్లి వీరభద్రం (26) అనే యువకుడికి పెన్‌పహాడ్ మండలం అనాజీపురం గ్రామానికి చెందిన పేర్ల ప్రణీత అనే యువతితో ఈనెల 21న వివాహం జరిగింది. వీరిద్దరూ హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వివాహం జరిగిన తర్వాత సోమవారం ఇద్దరూ కలిసి విధులకు హాజరు కావడానికి ఇంటి వద్ద నుండి ద్విచక్ర వాహనంపై హైదరాబాద్ కి బయలుదేరారు. ఈ క్రమంలో మార్గం మధ్యలో చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామ శివారులో రోడ్డు పక్కన ఉన్న ఒక బోర్డును వీరు వెళుతున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి బలంగా ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో వీరిద్దరూ ద్విచక్ర వాహనం నుండి కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ఇద్దరిని హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో యువకుడు వీరభద్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ప్రణీత కూడా తీవ్ర గాయాలపాలై ప్రాణాలతో పోరాడుతోంది. కాళ్ల పారాణి ఆరకముందే నవ దంపతులిద్దరూ ఇలా రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఇరు కుటుంబాలలో తీవ్ర విషాదం అలుముకుంది. ఎన్నో ఆశలతో కొత్త జీవితం ప్రారంభించిన వీరిద్దరూ ఇలా అనుకోని ప్రమాదం వల్ల వీరభద్రం మృతి చెందాడు. కాగా వీరభద్రం తల్లిదండ్రులకు అతను ఒక్కడే కొడుకు. పైగా పెళ్లయిన తొమ్మిది రోజులలోనే మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా పిలిపిస్తున్నారు.