పరువు హత్యలు రోజు రోజుకు కలకలం రేపుతున్నాయి. కూతురు వేరే కులం వాడిని ప్రేమించిందని కన్న తల్లిదండ్రులే అతి కిరతకంగా మారుతున్నారు. ప్రేమిస్తే తప్పు కాదని అమ్మాయి, అబ్బాయి పెళ్లి చేసుకుంటే వారికి అడ్డు చెప్పే హక్కు తల్లిదండ్రులకు కూడా లేదని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును బేఖాతారు చేస్తున్నారు. తమకు అన్నింటికంటే పరువే ముఖ్యమన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో జరిగిన పరువుహత్య కలకలం రేపుతోంది. అసలు వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే…
ప్రకాశం జిల్లా తాళూరు సమీపంలోని కొత్తపాలెం గ్రామానికి చెందిన కోట వెంకటరెడ్డికి ఇద్దరు కుమార్తెలు. ఒక కొడుకు ఉన్నాడు. వీరి రెండో కుమార్తె వైష్ణవి. ఒంగోలులోని ఓ ప్రైవేటు కాలేజిలో వైష్ణవి బీకాం సెకండియర్ చదువుతోంది. రోజు కాలేజికి బస్సులో వచ్చి వెళ్లేది. ఈ క్రమంలోనే లింగసముద్రం గ్రామానికి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది.
ఫస్టియర్ లో ఉన్నప్పుడే వీరి ప్రేమ వ్యవహారం తెలిసిన కాలేజి యాజమాన్యం వీరిని మందలించింది. తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. వారు అప్పుడు బెదిరించి ఊరుకున్నారు. అయినా కూడా వీరి మధ్య సంబంధం కొనసాగింది. అబ్బాయి ఒంగోలులోనే ఓ ప్రైవేటు హాస్టల్ లో ఉంటున్నాడు. గత గురువారం ప్రియుడు పిలిచాడని తిరుపతి వెళ్లింది. విషయం తెలుసుకున్న తండ్రి ఇంటికి తీసుకు వచ్చాడు. అంతకు ముందే రెండు మూడు సార్లు వెళితే తండ్రి ఆచూకీ తెలుసుకొని ఇంటికి తీసుకు వచ్చాడు.
శనివారం స్నానానికి అని వెళ్లి ప్రియుడితో కలిసి మళ్లీ వెళ్లి పోయింది. తండ్రి నచ్చ చెప్పి ఎలాగో అలా ఆదివారం ఇంటికి తీసుకు వచ్చాడు. ప్రియునితోనే వెళ్లిపోతానని తండ్రితో వాగ్వాదం చేసింది. ఎన్నిసార్లు నచ్చచెప్పినా వినకుండా పదే పదే వెళ్లి కుటుంబం పరువుతీస్తోందని తండ్రి ఆగ్రహం చెందాడు. కూతురి గొంతు పిసికి ఊపిరాడకుండా చేసి చంపాడు.
సోమవారం ఉదయం ఏం తెలియనట్టు తన బిడ్డ జ్వరంతో బాధపడుతుందని వచ్చి చూడాలని ఆర్ ఎంపీ డాక్టర్ ను ఇంటికి తీసుకువచ్చాడు. అప్పటికే వైష్ణవి మరణించి ఉంది. దీంతో అతను చనిపోయిందని చెప్పాడు. వెంకట్ రెడ్డి యాక్షన్ చేయబోయినా కుదరక బయటపడ్డాడు. చివరకు తన కూతురిని తానే చంపానని ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమిస్తే వారిని చంపుతున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతుండడంతో ఆందోళన నెలకొంది.