మిర్యాలగూడ అమృత ఇంట్లోకి వచ్చింది ఇతనే (ఎక్స్ క్లూజివ్ వీడియో)

మిర్యాలగూడలో దారుణ హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్ ఇంట్లోకి చొరబడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తి తమ ఇంట్లోకి ప్రవేశించాడని, ముఖానికి మాస్క్, నడుముకు నల్లని తాడు కట్టుకుని ఉన్నాడని ప్రణయ్ భార్య అమృత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అమృతను తమ నుంచి దూరం చేసేందుకు తనను చంపాలని పథకం పన్నారని ప్రణయ్ తండ్రి బాలస్వామి ఆరోపించారు.

 ప్రణయ్ కుటుంబ సభ్యులు అందించిన సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు  సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలం కరక్కాయలగూడేనికి చెందిన ఆంజనేయులును అదుపులోకి తీసుకున్నారు. అతడు పాత నేరస్తుడని పేర్కొన్నారు. ప్రణయ్ కుటుంబానికి రక్షణగా ఉన్న పోలీసు సిబ్బంది గది నుంచి  అతడు పర్సును దొంగిలించినట్టు డీఎస్పీ పి.శ్రీనివాసులు తెలిపారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడించనున్నట్టు పేర్కొన్నారు.  ఆంజనేయులు అమృత ఇంట్లోకి వచ్చిన సిసి టివి వీడియో  కింద ఉంది చూడండి.

 

తనను చంపేస్తారని, తనతో పాటు ప్రణయ్ కుటుంబ సభ్యలందరికి ప్రాణహాని ఉందని అమృత సంచలన వ్యాఖ్యలు చేసింది. తనను బతకనివ్వరని, తనను చంపేయడం ఖాయమని అమృత వ్యాఖ్యానించింది. శనివారం ప్రణయ్ ఇంట్లోకి ఓ ఆగంతకుడు రావడంతో అమృత ఆందోళన వ్యక్త చేసింది.

ఇటీవలే ప్రణయ్ హత్య కేసు నిందితులు మారుతీరావు, ఎంఏ కరీం, శ్రావణ్ కుమార్ లపై పిడి యాక్ట్ నమోదు చేసి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. కూతురు ప్రేమ వివాహం చేసుకుందని అమృత తండ్రి మారుతీరావు అల్లుడు ప్రణయ్ ని కిరాయి హంతకులతో హత్య చేయించాడు. ఈ హత్యోందంతం పెను సంచలనమే సృష్టించింది.

ప్రణయ్ మరణం తర్వాత అమృత ప్రణయ్ ఇంట్లోనే ఉంటోంది. ప్రస్తుతం ఆమె ఆరు నెలల గర్భిణి. ప్రణయ్ మరణం తర్వాత ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. అమృత ప్రాణాలకు ముప్పు ఉందని పోలీసు భద్రతను కూడా ఏర్పాటు చేశారు. అమృతకు అనేక ప్రజాసంఘాలు, పార్టీలు అండగా నిలిచాయి. ప్రణయ్ హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలని అమృత డిమాండ్ చేసింది. ప్రణయ్ విగ్రహం ఏర్పాటు చేయాలని అమృత డిమాండ్ చేయగా కొందరి నుంచి విమర్శలు కూడా వచ్చాయి.

ఇప్పుడు ఆగంతకుడు వారి ఇంటికి రావడంతో అమృత ప్రాణాలతో పాటు కుటంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు ఉందని ప్రణయ్ కుటుంబ సభ్యులు ఆందోళణ వ్యక్తం చేస్తున్నారు. అమృత గర్బవతి కావడంతో కడుపులో ఉన్న బిడ్డకు హని తలపెట్టాలనే ఉద్దేశ్యంతోనే ఈ విధమైన పనులు చేస్తున్నారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రణయ్ మరణం తర్వాత అమృత తన తండ్రి ఇంటికి వెళ్లకుండా ప్రణయ్ ఇంట్లోనే ఉంటోంది. పుట్టే బిడ్డ ఎవరైనా సరే అందులో ప్రణయ్ ని చూసుకోని బతుకుతానని చెప్పింది. ప్రేమికుల పై జరిగే హత్యలపై పోరాడుతానని అమృత తెలిపింది.