విశాఖలో మహిళా రిపోర్టర్ పై జరిగిన దాడి సంచలనం రేపింది. మహిళా జర్నలిస్టులపై దాడులు క్రమంగా పెరిగిపోతున్నాయి. కొద్ది రోజుల క్రితమే గుంటూరుకి చెందిన మహిళా జర్నలిస్టుని చంపుతామంటూ ఒక పొలిటీషియన్ కి సంబంధించిన వ్యక్తులు బెదిరించారు. ఈ ఘటన మరువకముందే విశాఖపట్నంలోని గోపాలపట్నంలో మహిళా రిపోర్టర్ ని చంపటానికి ప్రయత్నం జరగడం కలకలం రేపింది. ఆ వివరాలు కింద ఉన్నాయి చదవండి.
గోపాలపట్నం పరిధిలో కొందరు ప్రభుత్వ రోడ్ల స్థలంలో బడ్డీ కొట్లు పెట్టుకున్నారు. అయితే ఉషారాణి అనే మహిళా రిపోర్టర్, అక్రమంగా ప్రభుత్వ రోడ్డుని కబ్జా చేసి బడ్డీ కొట్లు నిర్వహిస్తున్నారంటూ సదరు కొట్లు యజమానులపై సమాచార హక్కు చట్టం కింద జీవీఎంసీ జోన్-6 లో లెటర్ పెట్టింది. వీటిపై విచారణ జరిపిన జీవీఎంసీ అధికారులు అక్రమంగా పెట్టిన బడ్డీ కొట్లకు కర్రెంట్ కట్ చేశారు.
దీంతో ఉషారాణిపై మనసులో కక్ష పెట్టుకున్నాడు ఒక బడ్డీ కొట్టు యజమాని సంతోష్. తనతో పాటు మరి కొందరి వ్యక్తులతో కలిసి ఆమెను హతమొందించాలని ప్లాన్ వేసుకున్నాడు. ఆమె ఆఫీస్ నుండి తిరిగి వచ్చే సమయంలో కొంతమంది అనుచరులతో కలిసి గోపాలపట్నం హైస్కూల్ రోడ్డు వద్ద కాపు కాసాడు. ఉషారాణి అక్కడికి చేరుకోగానే ఆమెపై బ్లేడుతో దాడికి దిగారు. ఆమె పారిపోతుండగా ఇంటి వరకు వెంబడించి ఇంటి మీద దాడి చేశారు. ఈ నేపథ్యంలో మహిళా రిపోర్టర్ తీవ్ర గాయాలపాలయ్యి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.