ప్రేమ పెళ్లిలకు పెద్దలు ఒప్పుకోకపోవడంతో ప్రేమికుల ఆత్మహత్యలు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రేమ కోసం నిండు జీవితాలను బలి చేసుకుంటున్నారు. అటు పెద్దలు కరగక ఇటు ప్రేమికులు తమ ప్రేమను మర్చిపోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలో తమ నిండు ప్రాణాలను బలి చేసుకుంటున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య కలకలం రేపింది. అసలు వివరాలు ఏంటంటే…
తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా అత్తిమాంజేరి గ్రామానికి చెందిన హేమంత్ కుమార్, మోనీషా నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరిది కూడా ఒకే సామాజిక వర్గం. ఒకే సామాజిక వర్గం కావడంతో ఇంట్లో వారు కూడ తమ పెళ్లిలకు ఒప్పుకుంటారని ఆశతో ఉన్నారు. మోనీషా తనకు వస్తున్న సంబంధాలను కూడా చెడగొట్టుకుంటూ వచ్చింది.
ఇక దాచడం ఎందుకు అనుకొని అసలు విషయాన్ని మోనీషా, హేమంత్ కుమార్ తమ తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పి తమ పెళ్లి చేయాలని కోరారు. పెళ్ళికి మోనీషా తల్లిదండ్రులు నిరాకరించారు. మంచి ఉద్యోగం లేని వాడికి ఇచ్చి ఎలా పెళ్లి చేయాలని ప్రశ్నించారు. వరుసకు బావ అయిన వ్యక్తితో పెళ్లి చేయాలని ఆమె పై ఒత్తిడి తెచ్చారు.
ప్రాణంగా ప్రేమించిన హేమంత్ కుమార్ ను తప్ప వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోనని మోనీషా వాళ్లకు స్పష్టం చేసింది. మోనీషా తల్లిదండ్రులు దీనిని ప్రతిఘటించారు. ఏం చేసినా సరే హేమంత్ కు ఇచ్చి పెళ్లి చేసేది లేదని చెప్పారు. ఇలా ఇంట్లో నెల రోజులుగా వివాదాలు నడుస్తున్నాయి. హేమంత్ కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి ఒప్పుకున్నారు. కానీ మోనీషా ఇంట్లో ఒప్పుకోకపోవడంతో పెళ్లి చేసుకుంటే ఏమైనా చేస్తారేమోనని భయపడ్డారు. దీంతో పెళ్లి చేసుకొని ఇబ్బందులు తెచ్చుకునే బదులు చావే శరణ్యమనుకున్నారు.
ఇద్దరు కూడా వారి ఇండ్లలో తెలియకుండా రైలెక్కి కుప్పం రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. రాత్రంతా తీవ్ర సంఘర్షణకు గురైన వారు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. బుధవారం ఉదయం దళవాయి కొత్తపల్లి రైల్వే గేటు సమీపానికి చేరుకున్నారు. అక్కడే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.
విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు వారి దగ్గర ఉన్న ఫోన్ల ఆధారంగా వారి బంధువులకు సమాచారం ఇచ్చారు. కుప్పం ఏరియా ఆసుపత్రికి మృతదేహాలను తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. వారి బంధువులు అక్కడకు చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు.
మోనీషా తల్లిదండ్రులకు చెప్పినా కూడా వినకుండా రెండు ప్రాణాలను బలిపెట్టుకున్నారని హేమంత్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. వారికి పెళ్లిలు చేస్తే అందరి జీవితాలు బాగుండేవన్నారు. చేతికి ఎదిగి వచ్చిన కొడుకు మరణించడంతో తమకు దిక్కెవరంటూ తల్లిదండ్రులు రోదించిన తీరు అందరిని కలిచి వేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.