ప్రేమ… హత్య గుట్టును బయట పెట్టిన మందు బాటిల్

యాదాద్రి జిల్లా చౌటుప్పల్ లో దారుణం జరిగింది. వరుసకు చెల్లెలు అయ్యే అమ్మాయిని ప్రేమించాడని సవతి తల్లి యువకుడిని హత్య చేయించింది. చౌటుప్పల్ కు చెందిన సచిన్ తన చిన్నమ్మ కూతురిని ప్రేమించాడు. దీంతో విషయం తెలుసుకున్న సవతి తల్లి సచిన్ ను మట్టుబెట్టాలనుకుంది. సచిన్ తో స్నేహంగా ఉండే గౌస్ కు సుపారీ ఇచ్చి సచిన్ ను చంపితే తన ఆస్తిలో వాటాతో పాటు తన కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తానని ఆఫర్ ఇచ్చింది. దీంతో గౌస్ సచిన్ ను తీసుకొని వెళ్లి మద్యం తాగిన తర్వాత గొంతునులిమి హత్య చేశాడు. ఆ తర్వాత సచిన్ మృతదేహాన్ని గౌస్ అంకిరెడ్డిగూడెంలో పడేశాడు. చిన్న క్లూ ఆధారంగా రాచకొండ పోలీసులు కేసు చేధించారు. సచిన్ మృతదేహం వద్ద మందు బాటిల్ లభించింది. దీంతో చౌటుప్పల్ లోని అన్ని వైన్స్ షాపుల వద్ద గల సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. గౌస్ , సచిన్ మద్యం సీసాను తీసుకెళుతున్న దృశ్యం రికార్డయ్యింది. సచిన్ తో గౌస్ మాత్రమే ఉన్నాడు. దీంతో గౌస్ పై అనుమానంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది.  దీంతో సవతి తల్లిని, గౌస్ తామే ఈ హత్యకు పాల్పడ్డట్టు ఒప్పుకున్నారు. పోలీసులు వారిని రిమాండ్ కు తరలించారు.