బ్రేకింగ్ న్యూస్: కర్నూల్ లో భారీ పేలుడు, పది మంది మృతి

కర్నూల్ జిల్లా హలూరు మండలం హాత్తిబెళగల్ గ్రామంలోని చౌదరి అనే వ్యక్తి క్వారీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పది మంది అక్కడికక్కడే మృతి చెందగా మరికొంత మంది గాయపడ్డారు. క్వారీలో పేలుడుతో మంటలు అంటుకొని 3 ట్రాక్టర్లు, లారీ, షెడ్డు తగలబడ్డాయి. షెడ్డులో మరికొంత మంది చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మృతదేహాలన్ని చెల్లాచెదురుగా రక్తముద్దలుగా ఎగిరిపడ్డాయి. భారీ పేలుడు ధాటికి స్థానికులు భయంతో పరుగులు తీశారు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. షెడ్డులో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులకు సమాచారమిచ్చినా స్పందించలేదని స్థానికులు పోలీసు స్టేషన్ లో ఆందోళన నిర్వహిస్తున్నారు. ప్రమాదంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.