రోడ్డెక్కిన కోఠి ఉమెన్స్ కాలేజ్ స్టూడెంట్స్

కోఠి ఉమెన్స్ కాలేజ్. హైదరాబాద్ నడిబొడ్డున ఉంటది. ఈ పేరు తెలియని వారుండరు. ఆ కళాశాల పేరు చెప్పగానే చరిత్ర గుర్తుకు వస్తది. అటువంటి కళాశాల నేడు సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. వేలాది మంది విద్యార్థులకు చదువుల ఇల్లు అయిన ఉమెన్స్ కాలేజి విద్యార్థులు తమ సమస్యలు పరిష్కరించండంటూ రోడ్డెక్కారు.

సకాలంలో స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించాలని కళాశాల విద్యార్థులు రోడ్డెక్కారు. దీంతో రెండు కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఉమెన్స్ కాలేజిలోని హాస్టల్ సమస్యలు మీడియాకు చెబితే  విద్యార్ధులను గుర్తించి ఫెయిల్ చేస్తామని కళాశాల యాజమాన్యం బెదిరిస్తోందని పలువురు విద్యార్ధులు వాపోయారు.

రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న విద్యార్ధినిలు

కోఠి కళాశాలలో 3 వేల మంది విద్యార్ధులు చదువుతున్నారు. వారికి మూడేళ్ళుగా స్కాలర్ షిప్ అందడం లేదు. దీనికి తోడు కళాశాలకు సంబంధించిన ఫీజలు చెల్లించాలని కళాశాల యాజమాన్యం ఒత్తిడి తెస్తోంది. కళాశాలలో కనీస వసతులు కూడా లేవు. అయినా మమ్మల్ని ఫీజులు చెల్లించాలని ఒత్తిడి తెస్తారా అంటూ విద్యార్ధులు మూకుమ్మడిగా కోఠి సర్కిల్ కు చేరుకొని ఆందోళనకు దిగారు. 800 మంది విద్యార్ధులు ఒకే సారి రోడ్డెక్కడంతో పోలీసులు కూడా వారిని అదుపు చేయలేక పోయారు.

హాస్టల్ లో ఒకే బెడ్ పై ఇద్దరు పడుకోవాల్సి వస్తుందని, రాత్రి వేళల్లో దోమలు స్వైర విహారం చేస్తున్నాయని విద్యార్దులు తెలిపారు. పచ్చని చెట్లతో బయటి నుంచి చూడటానికి కళాశాల మంచిగా కనిపిస్తుంది  కానీ లోపల నానా రభస పడుతుంటామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది నిరుపేద కుటుంబాలకు చెందిన వారు ఇందులో చదువుకుంటారు. కానీ కోఠి కాలేజిలో ప్రైవేటు కశాశాలలతో సమానంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ కళాశాల అనే కదా ఇందులో చేరింది ప్రైవేటు కాలేజి మాదిరిగా చేస్తే మా ఊళ్లలోనే చదువుకునే వారిమని వారు అన్నారు. ప్లేస్ మెంట్ పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి అదనంగా 2 వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. కళాశాల ఫీజును ఏటా 10 శాతం పెంచుతున్నారు. ఒక్కొక్క విద్యార్ధికి కళాశాల ఫీజు 16 వేలు ఉంటే ప్రభుత్వం 10 వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తుందని మిగిలిన ఆరు వేలు తామే చెల్లించాల్సి వస్తుందని విద్యార్ధులు తెలిపారు. కాలేజిలో నీళ్లు ఉండవని బయటి నుంచి నీరు కొనుక్కొని రావాల్సి వస్తుందన్నారు. మరుగుదొడ్లు, స్నానాల గదుల తీరు చెప్పలేమన్నారు. మీడియాకు చెబితే వారిని గుర్తించి పరీక్షలలో ఫెయిల్ చేస్తున్నారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. వీరి మెరుపు ఆందోళనకు పలు విద్యార్ది సంఘాలు మద్దతు ప్రకటించాయి. విద్యార్దులపై కళాశాల యాజమాన్యం చేస్తున్న వేధింపులు ఆపాలని తక్షణమే స్కాలర్ షిప్పు, రీయింబర్స్ మెంట్ విడుదల చేయాలని ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జావీద్, ఏబీవీపీ జాతీయ కార్యదర్శి రాజేంద్రప్రసాద్, శ్రీశైలం గౌడ్ డిమాండ్ చేశారు.

విషయం తెలుసుకున్న ఏసీపీ చేతన విద్యార్దులను సముదాయించి వారితో చర్చించారు. విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ రోజా రమణికి తెలియజేయడంతో 15 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని, ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆమె హామీనివ్వడంతో విద్యార్ధులు ఆందోళన విరమించారు.