కాణిపాకం లడ్డు ప్రసాదం ఎలా తయారవుతున్నదో తెలుసా?

ప్రసాదం అంటేనే పవిత్రంగా చూసి దానిని కళ్లకు అద్దుకొని మరీ తింటాం. ప్రసాదంలో వరి గింజంతా దొరికినా సంతోషంగా తీసుకుని తింటాం. అంతటి పవిత్రంగా భావించే ప్రసాదం అపవిత్రం అయిపోతుంది. భక్తులంతా తిరుపతి తర్వాత ఎక్కువగా దర్శించుకునేది కాణిపాక వరసిద్ది వినాయకుడిని. ఎందుకంటే వినాయక దేవాలయాలు తక్కువగా ఉండటం, అందునా ఇక్కడ గణనాథుడు స్వయంభూ కావడంతో భక్తులు అధిక  సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడి దేవాలయంలో కూడా దాదాపు టిటిడి నిబంధనలే వర్తిస్తాయి. గణనాధునికి పెట్టే నైవేద్యంతో పాటు, భక్తులకు ఇచ్చే లడ్డూలు కూడా పురోహితులు తయారు చేయాలనేది నిబంధన. కానీ ఆ సాంప్రదాయం కాణిపాకంలో  తప్పుదారి పడుతుంది.

కాణిపాకం దేవస్థానం పోటులో స్వామివారికి సంబంధించిన లడ్డూలు, నైవేధ్యాలు పురోహితులే చేస్తారు. అలాగే భక్తులకు అందించే ప్రసాదాలను కూడా పురోహితులే దేవాలయం పోటులోనే తయారు చేయాలి. కానీ కాణిపాకం పోలీసు స్టేషన్ పక్కన ఉన్న కొట్టులో భక్తులకు ఇచ్చే లడ్డులు తయారు  చేస్తున్నారు. అది కూడా కాంట్రాక్టర్ల తో చేయిస్తున్నారు.  కాంట్రాక్టర్ కూలీలను నియమించి ఈ లడ్డులను తయారుచేయిస్తున్నారు.  ఈ లడ్డులు తయారవుతున్న మొత్తం విధానం చూస్తే ’ ఇది ప్రసాదం. కళ్లకు అద్దుకుని తినాల్సినంత పవిత్రమయిందా’ అనే అనుమానం వస్తుంది.

సాధారణ మిఠాయిల దుకాణాలలో స్వీట్లు ఎలా తయారవుతున్నాయో అదే పద్ధతిలో ప్రసాదంగా భక్తులు భావించే లడ్డూలు కూడా తయారువుతున్నాయి. భక్తులు ఏమాశిస్తారు. ఆలయ ప్రాంగణంలోనే లడ్డులు తయారవుతాయని, అవి నైవేద్యమంత పవిత్రంగా ఉంటాయని కదా. కాణి పాకంల లడ్డుల వ్యవహారం చూస్తే భక్తుల విశ్వాసాలు దెబ్బతింటాయి. మొత్తంగా అధికారుల చర్యల వల్ల కాణిపాకం లడ్డూ పవిత్రతతో పాటు నాణ్యతను కూడా కోల్పోతుంది.

కాంట్రాక్టర్ పురోహితులతో తయారు చేయిస్తే రోజుకు ఒక్కో పురోహితునికి 1000 రూపాయలు చెల్లించాలి. అదే బయటి వారితో అయితే వారికి రోజుకు వంద నుంచి రెండు వందల రూపాయల కూలీ మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. దీంతో కాంట్రాక్టర్ లాభ పడాలనే ఉద్దేశ్యంతో ఇలా చేస్తున్నాడని భక్తులు అంటున్నారు.  భక్తులకు తయారు చేసే ప్రసాదం పోటులో శుభ్రత లేకుండా లడ్డూలను తయారు చేస్తున్నారు. తయారీ చేసేవారు చేతులకు గ్లౌజులు ధరించకుండానే ప్రసాదాలు చేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. కొంత మంది మగవారు లుంగీల మీదే వచ్చి బెల్లం ముద్దలలాగా లడ్డులను తయారు చేస్తున్నారు. కనీస శుభ్రత పాటించకుండా లడ్డూల తయారీ సాగుతుంది.  భక్తులు అధిక ప్రాముఖ్యత ఇచ్చే దైవ  ప్రసాదం ఇంత ఘోరంగా తయారవుతుంది. ఇందులో కూడా ఒక స్కాం నడుస్తూ ఉంది. కాంట్రాక్టర్ నిబంధనల ప్రకారం ప్రసాదాలను పురోహితులతోనే చేయించాలి.  ఇప్పుడు లడ్డులు తయారువుతున్న చోట ఒక్క పురోహితుడు కూడా లేడు. చుట్టు పక్కల పల్లెల నుంచి వ్యవసాయకూలీలనే పట్టుకొచ్చి లడ్డులు చేయిస్తున్నారు. పురోహితులు కాని వారు లడ్డు తయారుచేయకూడదన్నది కాదు విషయం. టెండర్ నియమాలను ఉల్లంఘిస్తున్నారన్నదే ఇక్కడ పాయింట్. ఎవరైనా ఉన్నతాధికారులు వచ్చినప్పుడు అందులో పని చేసే వారికి జంధ్యం వేసి వారినే కాంట్రాక్టర్  పురోహితులుగా చూపిస్తున్నారని ఫిర్యాదులున్నాయి. దీనికి దేవాలయం అధికారులు వత్తాసు పలకడం గమనార్హం.

పవిత్రంగా భావించే ప్రసాదం ఇంత అపవిత్రం అవుతుంటే క్రమక్రమంగా అది మిగిలిన దేవాలయాలకు కూడా వ్యాపిస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే తిరుమలలో ప్రసాదం పురోహితులు తప్ప మరొకరు చేయడానికి వీలులేదు. అక్కడ కూడా ఇలానే జరగదా అనే అనుమానాలు పలువురు భక్తులు వ్యక్తం చేస్తున్నారు. దీంతో దేవాలయాలలో ప్రసాదాల తయారీపై చర్చ జరుగుతుంది.

ఆది దేవునిగా చెప్పుకునే విఘ్నేషున్ని దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. అటువంటి విఘ్నేషుని సన్నిధిలోనే ఇంతటి పాపం జరుగుతుంటే పట్టించుకునేది ఎవరని భక్తులు ప్రశ్నిస్తున్నారు. పవిత్రంగా భావించే ప్రసాదం ఇంతటి అపవిత్రతగా తయారు కావడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాణిపాకం ప్రసాదం తయారీని నిబంధనల ప్రకారం తయారు చేయించి ఆలయ పవిత్రతతో పాటు ప్రసాదం పవిత్రతను కాపాడాలని వారు కోరుతున్నారు.