(టి. లక్ష్మినారాయణ)
ఈ రోజు కడప స్టీల్ ప్లాంట్ కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయడం ఆహ్వానించ తగ్గ పరిణామం
ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి సంబంధించి “సాధ్యాసాధ్యాల అధ్యయనం” ముసుగేసుకొని కేంద్ర ప్రభుత్వం దగా చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ‘రాయలసీమ స్టీల్ కార్పోరేషన్ లిమిటెడ్’ సంస్థను ఏర్పాటు చేసి, వై.యస్.ఆర్. కడప జిల్లా, మైలవరం మండలం, యం.కంభాలదిన్నె గ్రామం వద్ద మూడు మిలియన్ టన్నుల వార్షిక ఉత్ఫత్తి సామర్థ్యంతో, మూడు వేల ఎకరాల విస్తీర్ణంలో, రు.20,000 కోట్ల పెట్టుబడి వ్యయ అంచనాతో, 10,000 మందికి ఉపాథి కల్పనా లక్ష్యంతో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పే సంకల్పంతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయడం సంతోషకరమైన ముందడుగు. ఉక్కు కర్మాగారం కోసం ఆందోళన చేస్తున్న ప్రజానీకానికి పాక్షిక విజయం.
కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు సరిహద్దు ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన ఉక్కు కర్మాగారం, సత్వరం కార్యరూపం దాల్చి, రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధికి, సమగ్రాభివృద్ధికి దోహదం చేస్తుందని ఆశిద్ధాం.
కర్మాగారం నిర్మాణంలో పాలకులు భవిష్యత్తులో అలసత్వం ప్రదర్శిస్తే రాయలసీమ ప్రజలు హక్కుగా పోరాడి సాధించు కోవడానికి ఈ ఘటన ఆయుధంగా ఉపయోగపడుతుంది.
రాష్ట్ర విభజనతో ఆర్థిక ఇబ్బందులు, అప్పుల ఊబిలో కూరుకపోయి ఉన్నా, ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని ప్రభుత్వ రంగంలో ఉక్కు పరిశ్రమను నెలకొల్పడానికి శంకుస్థాపన చేసినా, విభజన చట్టం మేరకు ఉక్కు పరిశ్రమను నెలకొల్పాల్సిన కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులోనైనా, 2019 సం. లోక్ సభ ఎన్నికల తదనంతరం ఏర్పడే నూతన ప్రభుత్వమైనా ఆ బాధ్యతను గుర్తించి, వెనుకబడ్డ మరియు నిత్య కరవు పీడిత రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేస్తుందని ఆశిద్ధాం!