ఇసుక నుంచి కూడా తైలాన్ని తీయగల సమర్థులు మన రాజకీయ నాయకులు.! కడప స్టీల్ ప్లాంట్ ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. అది 2007వ సంవత్సరం జూన్ 10. అప్పట్లో ముఖ్యమంత్రిగా వున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కడప ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. పదకొండేళ్ళ తర్వాత 2018లో ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అదే స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన చేశారు. అంటే, ఇద్దరు ముఖ్యమంత్రులు.. చెరోసారి కడప ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేశారన్నమాట.
ఇంతకీ, కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణం ప్రారంభమయ్యిందా.? ఆగండాగండీ.. ఈసారి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వంతు. 2019లో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కడప ఉక్కు పరిశ్రమకే శంకుస్థాపన చేశారు. ఇది జరిగి మూడేళ్ళయిపోయింది. తాజాగా మరోమారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భూమి పూజ చేయబోతున్నారు.
ముఖ్యమంత్రి వెళ్ళి శంకుస్థాపన చేయడమంటే.. ప్రోటోకాల్ ఖర్చులు గట్టిగానే వుంటాయ్ కదా.! ఆ లెక్కన, ఇప్పటిదాకా జరిగిన మూడు శంకుస్థాపనలకు ఎంత ఖర్చయి వుంటుంది.? శంకుస్థాపనలే కాదు, పైలాన్లు కూడా ఆవిష్కరించేశారండోయ్. మూడు శంకుస్థాపనలు జరిగాయ్ కదా.. ఇంకోసారి శంకుస్థాపన అంటే బాగోదు గనుక.. భూమి పూజ అని పేరు పెట్టుకున్నట్టున్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. జెఎస్‌డబ్ల్యు కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది ఈ ఉక్కు పరిశ్రమ నిమిత్తం. సుమారు 8,800 కోట్ల పెట్టుబడులు పెడతారట.
నిర్మాణం ఎప్పుడు మొదలవుతుందోగానీ, ఇంకోసారి శంకుస్థాపన, భూమి పూజ అనొద్దు మొర్రో.. అంటున్నారు ఉక్కు పరిశ్రమ కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ప్రజానీకం.