కేసీఆర్ కు జైలు వార్డర్ సూసైడ్ నోట్, సెల్ఫీ వీడియో

చర్లపల్లి జైల్లో వార్డర్ గా పని చేస్తున్న శ్రీనివాస్ అదృశ్యమయ్యాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సీఎం కేసీఆర్ కు లేఖ రాయడంతోపాటు సెల్పీ వీడియో తీసుకొని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. రైల్వే ట్రాక్ వద్ద వీడియో తీసుకోవడంతో ఉన్నతాధికారులు, కుటుంబసభ్యులు కలవరపడుతున్నారు. సెల్పీ ఆధారంగా శ్రీనివాస్ ఎక్కడ ఉన్నది కనిపెట్టేందుకు పోలీసులు ముమ్మర గాలింపు చేస్తున్నారు. శ్రీనివాస్ సెల్ఫీ వీడియో కింద ఉంది చూడండి.

శ్రీనివాస్ రాసిన లేఖ ఈ విధంగా ఉంది. “నేను 2012లో వార్డర్ గా విధుల్లో చేరాను. 2014 నుంచి చర్లపల్లి జైల్లో పనిచేస్తున్నాను. కొంత కాలంగా జైలు సూపరిండెంట్ చింతల దశరథం మానసికంగా వేధిస్తున్నాడు. తనపై లేని పోని విషయాలను డీజీ వినయ్ కుమార్ కు చెప్పి ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. డిప్యూటి సూపరిండెంట్ చేస్తున్న అవినీతిని ప్రశ్నించినందుకు తనపై కక్ష సాధిస్తున్నాడు.ఖైదీల వద్ద తాను లంచం తీసుకున్నట్టు ఒప్పుకోవాలని లేదంటే సస్పెండ్ చేయిస్తానని బెదిరిస్తున్నాడు. దశరథం గతంలో పది మంది వార్డెన్ల సస్పెండ్ చేయించాడు.ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నాయని పేర్కొంటూ ఖైదీలతో ఫోన్లు మాట్లాడిస్తూ లక్షల రూపాయలు దశరథం తీసుకుంటున్నాడు. ఆయనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎవరూ పట్టించుకోకపోవడంతో రెచ్చిపోతున్నాడు. దశరథం వేదింపులు తట్టుకోలేక పోతున్నా. బతుకుపై ఆశలు లేవు. నా భార్య పిల్లలను సీఎం కేసీఆర్ ఆదుకోవాలని కన్నీళ్లతో ఆత్మహత్య లేఖ రాస్తున్నాను” అని శ్రీనివాస్ లేఖ రాశాడు. తాను తీసుకున్న సెల్పీ వీడియో పోస్టు చేశాక అనంతరం ఫోన్ స్విఛ్చాప్ చేశాడు. పోలీసులు వీడియో ఆధారంగా ఏ స్టేషన్ లో నుంచి అని శ్రీనివాస్ ఆచూకీ కోసం వెతుకుతున్నారు. 24 గంటలైనా శ్రీనివాస్ ఆచూకీ దొరకకపోవడంతో అందరిలో కలవరం మొదలైంది.