పెద్దామెతో ప్రేమ వద్దన్నందుకు ఇంటర్ విద్యార్థి సూసైడ్ 

 
తనకంటే వయసులో పెద్దామెను ప్రేమించాడు ఒక కుర్రాడు. ఆమే తన సర్వస్వం అనుకున్నాడు. ఆమెతోనే జీవితం పంచుకోవాలి అనుకున్నాడు. ఈ విషయం అతని తల్లిదండ్రులకు తెలిసింది. నీకంటే వయసులో పెద్దామెను ప్రేమించడం ఏమిటని మందలించారు. వద్దని వారించారు. దీంతో కలత చెందిన ఆ కుర్రాడు ఆత్మహత్యకు ఒడిగట్టాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాలంటే కింద ఉన్న సమాచారం చదవాల్సిందే.
 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో జరిగిన ఘటన ఇది. లక్ష్మీదేవిపల్లికి చెందిన కాలం నాగయ్య, రత్తమ్మల పెద్ద కొడుకు నవీన్. ఇతని వయసు 18 ఏళ్ళు. ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. పాల్వంచ ప్రభుత్వ మెట్రిక్ హాస్టల్లో ఉంటున్నాడు. కాగత్ సొంత ఊరుకి చెందిన ఒక యువతితో నవీన్ కు ఫ్రెండ్షిప్ మొదలయ్యింది. అది కాస్త రోజులు గడుస్తున్నా కొద్దీ ప్రేమగా మారింది. 
 
అయితే కొడుకు నవీన్ ప్రేమ సంగతి తల్లిదండ్రులకు తెలిసింది. వయసులో నీకంటే పెద్దామెతో ప్రేమేంటని వాదించారు. ఈ వ్యవహారం అంతటితో వదిలెయ్యమని శుక్రవారం మందలించారు. తల్లిదండ్రుల మందలింపుతో మనస్థాపానికి గురైన నవీన్ హాస్టల్ కు వచ్చేశాడు. ఇదే విషయాన్ని అతను ప్రేమిస్తున్న యువతికి తెలిపాడు. ఆమె కూడా సున్నితంగా తిరస్కరించింది. 
 
దీంతో కలత చెందిన నవీన్ శుక్రవారం అర్ధరాత్రి పక్కనే ఉన్న డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో ఉన్న చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెల్లవారుఝామున వాకింగ్ కి వచ్చిన విద్యార్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నవీన్ తల్లిదండ్రులకు విషయం తెలియజేసారు.
 
కొడుకు మరణవార్త విని ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. చదువుకుని ప్రయోజకుడవుతాడు అని ఎన్నో ఆశలతో పెంచుకున్న కొడుకు ఇక తిరిగి రాడని తెలిసి నాగయ్య, రత్తమ్మ గుండెలు అవిసేలా రోదిస్తున్నారు. సోదరుడు మృతితో తోబుట్టువులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. నవీన్ సహచర విద్యార్థులు, అతని స్నేహితులు కుమిలిపోతున్నారు. నవీన్ మృతితో ఇటు కాలేజీలోని, అతని స్వగ్రామంలోని విషాద ఛాయలు అలుముకున్నాయి.