ఆడపిల్ల పుట్టిందని ఫోన్ లోనే తలాక్ చెప్పిన భర్త

బిడ్డ పుట్టిందని ఆ తల్లి మురిసిపోయింది. ఆ ఆనంద క్షణాలను భర్తతో పంచుకోవాలని ఆశపడింది. కానీ అతగాడి తీరు వేరుగా ఉంది. తన అభిమతానికి వ్యతిరేకంగా భార్య ఆడ బిడ్డకు జన్మనిచ్చిందన్న కోపంతో ఫోన్‌లోనే మూడుసార్లు తలాక్‌ చెప్పేసి నీకూ…నాకూ ఏ సంబంధం లేదు, పొమ్మన్నాడు. హైదరాబాద్‌ మహానగరం టోలీచౌకీలో జరిగిన ఈ ఘటన మూడు వారాల క్రితం జరగగా ఆలస్యంగా వెలుగు చూసింది.

హైదరాబాద్ టోలీచౌకీలో నివాసం ఉంటున్న ముజమ్మిల్‌ ఓ ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపాల్‌. గత ఏడాది జనవరిలో ఆ ప్రాంతంలోనే ఉంటున్న యువతిని పెళ్లాడాడు. మూడు నెలల క్రితం ఆమె పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తన అభీష్టానికి వ్యతిరేకంగా భార్య ఆడపిల్లకు జన్మనిచ్చిందన్న కోపంతో ప్రసవ సమయం నుంచి ముజమ్మిల్‌ భార్యను ఏదో రూపంలో వేధిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో నవంబరు 28న ముజమ్మిల్ భార్యకు ఫోన్‌ చేశాడు. ఆమె ఫోన్‌ ఎత్తగానే ‘తలాక్‌’ తలాక్ అంటూ మూడుసార్లు చెప్పేసి ఫోన్‌ పెట్టేశాడు. దీంతో హతాశురాలైన ఆమె విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు పై సీసీఎస్‌ పోలీసులు విచారణ జరుపుతున్నారు. తలాక్ చెల్లదని సుప్రీం కోర్టు తీర్పు చెప్పినా కూడా పలువురిలో మార్పు రావడం లేదని మహిళా సంఘాల లీడర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.