కరోనా అందరికీ కష్టాలు తెచ్చిపెట్టింది. అగ్రరాజ్యం అమెరికా కూడా చిగురుటాకులా వణికిపోయింది. అక్కడి ప్రజలకు కూడా ఆర్ధిక కష్టాలు వచ్చాయి. ఇదే ఇప్పుడు ఓ ఇంటి యజమానురాలికి కష్టం తెచ్చింది. అమెరికాలో విధించిన కోవిడ్ రూల్స్ ఆమె పాలిట శాపమైంది. ఆమెకు ఎంత కష్టం వచ్చిందంటే.. తన సొంత ఇంటిలోకి వెళ్లలేక తన కారులోనే నివాసం ఉంటుంది. తాను అద్దెకిచ్చిన ఇంట్లో ఉంటున్న వారికి కోవిడ్ రూల్స్ లాభించడమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఆ యజమాని తన ఇంటి కోసం పోరాడుతోంది. కోర్టులో కేసు కూడా వేసి పోరాడుతోంది. విచిత్రమైన ఈ ఘటన అమెరికాలోని న్యూయార్క్ లో జరిగింది.
న్యూయార్క్‌కు చెందిన షావ్నా ఎక్లెస్ అనే 30 ఏళ్ల మహిళకు కరోనా కారణంగా ఉద్యోగం పోయింది. దీంతో తాను నివాసం ఉంటున్న ఇంటికి అద్దె కట్టలేక పోయింది. దీంతో కానార్సీలోని తన సొంతింటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. ఆ ఇంటిని అప్పటికే వేరొకరికి అద్దెకు ఇచ్చింది. వారిని ఖాళీ చేయాలని కోరింది. అయితే.. న్యూయార్క్ కొత్తగా విధించిన కోవిడ్ రూల్స్ ప్రకారం అద్దెకు నివసించే వారు మే 1 వరకూ ఇల్లు ఖాళీ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీనినే సాకుగా చూపిస్తున్నారు టెనెంట్స్. రూల్స్ ప్రకారం ఎక్లెస్ కు ఇంటి అద్దె కూడా చెల్లించట్లేదు. టెనెంట్స్ వల్ల ఎక్లెస్ కు డబ్బు అందక.. ఎక్కడ ఉండాలో తెలీక తన కారులోనే నివాసం ఉంటోంది.
తనకు ఉద్యోగం లేదనీ.. డబ్బులు లేక కారులో నివసిస్తున్నానంటూ తన ఇంట్లో అద్దెకు ఉంటున్న సరితా పీటర్సన్ పై కోర్టుకెక్కింది. అద్దె ద్వారా తనకు నెలకు 2100 డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం 1.52 లక్షలు) అద్దె లభించేదని.. కొన్ని నెలలుగా అద్దె లభించడం లేదని తెలిపింది. ఇప్పటివరకూ 14,700 డాలర్లు.. భారత కరెన్సీ ప్రకారం 10లక్షల 65వేల 702 రూపాయలు రావాల్సి ఉందని పేర్కొంది. 2019లో తన ఇంటి కోసం 4లక్షల 77వేల డాలర్లు.. భారత కరెన్సీ ప్రకారం 3కోట్ల 45లక్షల 80వేల 949 రూపాయలు ఖర్చు చేసినట్టు పేర్కొంది. ఇవన్నీ తనకు భారంగా మారాయని ఎక్లెస్ కోర్టుకు విన్నవించింది.