టిక్ టిక్ టిక్…రాత్రి 2, నేరేడ్‌మెట్ లో భయం భయం

సికింద్రాబాద్ మల్కాజిగిరి మండలం ఆర్కే పురంలో గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆగడాలు సృష్టించారు. ఆర్కే పురం, బాలాజీ కాలనీలో పలు కార్ల అద్దాలను బండ రాళ్లతో పగలగొట్టారు. కాలనీ మొత్తం తిరుగుతూ బయట పార్క్ చేసిన కార్ల అద్దాలను పగలగొట్టారు. ఈ ఘటనతో ఒక్కసారిగా కాలనీ వాసులంతా ఉలిక్కి పడ్డారు. దీనిపై మరిన్ని వివరాలు కింద ఉన్నాయి చూడండి.

ఆర్కే పురం…నేరేడ్‌మెట్ పీఎస్ పరిధిలో ఉంది. ఈ ఏరియా ప్రశాంతమైన నివాసయోగ్యమైనదిగా పలువురు చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఈ ఏరియా చుట్టుపక్కల ఆర్మీ వ్యవస్థ ఉంది. సో…ఇది సేఫెస్ట్ ప్లేస్ గా స్థానికులు చెబుతారు. వారు చెప్పినట్టే అక్కడ ఎటువంటి దుశ్చర్యలు జరగవు. దొంగతనాలు కూడా చాలా చాలా అరుదు. అటువంటిది ఆ కాలనీలో గురువారం అర్ధరాత్రి జరిగిన ఘటన కలకలం రేపింది.

అర్ధరాత్రి 1:30 నుండి 2:30 గంటల సమయం మధ్యలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. అర్ధరాత్రి బాలాజీ కాలనీలోకి చొరబడ్డారు ఈ ఆగంతకులు. అందరూ మత్తు నిద్రలో ఉండే సమయం చూసుకుని ఈ ఘటనకు పాల్పడినట్టు స్పష్టమవుతోంది. పలువురి ఇళ్ల ముందు నిలిపిన కార్లను 7-8 సభ్యుల ముఠా బండ రాళ్లతో పగలగొట్టి విధ్వంసం చేశారు. సుమారు 10 కార్లను వీరు ధ్వంసం చేసినట్టు సమాచారం. ఆ తర్వాత అక్కడ నుండి పరారయినట్టు కొందరి ఇళ్ల ముందు ఉన్న సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి.

ఉదయం నిద్ర లేచిన కారు యజమానులు కార్ల అద్దాలు పగిలి ఉండటం చూసి విస్తు పోయారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు జాగిలాలతో కాలనీలో సెర్చ్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసువారు పలువురిని విచారించారు. ఆగంతకులను చూసినవారిని ప్రశ్నించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు సమాచారం.

అయితే ఈ గ్యాంగ్ ని గమనించిన కొందరు కాలనీవాసులు వారంతా నల్ల వస్త్రాలు ధరించి, చూడటానికి గంభీరమైన బాడీలతో ఉన్నట్టు చెబుతున్నారు. కాలనీలో సంచరిస్తున్నప్పుడు చూశాం కానీ ఆగంతకులు అనుకోలేదు అని అంటున్నారు. అయితే కార్లు పగలగొడుతుండగా ఎవరూ వారిని చూడలేదని చెబుతున్నారు. ఈ ముఠా ఒక సుమోలో వచ్చినట్టు తెలుస్తోంది. వీరందరిని ఒకచోట వదిలి డ్రైవర్ ఆ సుమో తీసుకుని వెనక్కి వెళ్ళిపోయినట్టు సమాచారం. ఈ గ్యాంగ్ కార్లను పగలగొట్టి పక్కనే ఉన్న రైల్వే బ్రిడ్జి దాటుకుని అవతలివైపుకి వెళ్లినట్టు సీసీ కెమెరా దృశ్యాలలో చిత్రీకరించబడింది.

కాగా ఇటువంటి దాడులు గతంలో రాజమండ్రి, హైదరాబాద్ రామంతాపూర్ లో కూడా చోటు చేసుకున్నాయి. అయితే వీరందరూ ఒకే గ్యాంగ్ కి సంబంధించినవారా లేక వేరు వేరు సభ్యులా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కాలనీలో మరిన్ని సీసీ కెమెరాలు అమర్చుకోవాల్సిన బాధ్యత కాలనీ వాసులకు ఉందని పోలీసులు హెచ్చరించారు.

గతంలో ప్రతిరోజూ పగలు, రాత్రి కాలనీలో పోలీసు పెట్రోలింగ్ వాహనం తిరుగుతూ ఉండేది. కొద్ది రోజులుగా పెట్రోలింగ్ వాహనం కూడా తక్కువ స్థాయిలో చక్కర్లు కొట్టడం వీరికి ప్లస్ అయింది. విశేషం ఏమిటంటే ఈ గ్యాంగ్ సీసీ కెమెరాలు ఉన్న ఇంటి ముందు కార్లకు ఎటువంటి నష్టం కలిగించలేదు. దీంతో వీరంతా ముందే కాలనీలో పరిస్థితుల్ని గమనించి వెళ్లి ఉంటారనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.  ఈ ఘటనతో కాలనీ వాసుల్లో కొంత భయాందోళన నెలకొంది. పగులగొట్టిన కొన్ని కార్ల ఫోటోలు కింద చూడవచ్చు.