పోలవరంలో పెళ్ళిడు అమ్మాయిలకు కొత్త చిక్కు

పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో ఏమో గానీ ముంపు గ్రామాల ప్రజలకు పలురకాల కొత్త సమస్యలు తెచ్చి పెడుతుంది. ఈ ప్రాజెక్టు ముంపు బాధిత గ్రామాలలో పెళ్లిడుకొచ్చిన అమ్మాయిలకు కొత్త సమస్య వచ్చిపడింది. పోలవరం బాధిత గ్రామాల అమ్మాయిలకు వచ్చిన కొత్త సమస్యేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

ప్రభుత్వ నిబంధనలు, అధికారుల నిర్లక్ష్యం పోలవరం ముంపు గ్రామాల ప్రజల పాలిట శాపంగా మారాయి. పోలవరం పునరావాస చట్టంలో లేని కొన్ని నిబంధనలను ఓ ఉన్నతాధికారి అమలు చేయడం, దీనికి ప్రభుత్వం వత్తాసు పలకడంతో ముంపు గ్రామాల్లో పెళ్లి భాజాలు మోగడం లేదు. ఎప్పటి వరకు ఈ పరిస్థితి ఉంటుందో తెలియక, యువతుల వివాహ వయస్సు దాటిపోతుండటంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 ప్రాజెక్టు నిర్మాణం వల్ల పోలవరం మండలంలోని 19 మండలాలు, కుక్కునూరు గ్రామంలోని 89 గ్రామాలు, వేలేరుపాడు మండలంలోని 60 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ గ్రామాల్లోని నిర్వాసితులకు ఆర్అండ్ ఆర్ ప్యాకేజిని అమలు చేసేందుకు పోలవరం మండలంలోని ముంపు గ్రామాల్లో అధికారులు 2017 జూన్ 30వ తేదిని కటాఫ్ డేట్ గా నిర్ణయించారు. గతంలో చేసిన సోషియో ఎకనమిక్ సర్వే లో పేర్లు ఉన్నప్పటికి కటాఫ్ డేట్ 18 ఏళ్లు నిండిన వివాహం కాని యువతులకు మాత్రమే పునరావాస ప్యాకేజ్ అందిస్తామని అధికారులు గ్రామసభలో వెల్లడించారు. ముందుగా డేటాలో పేరు ఉంటే వివాహమైనా ప్యాకేజి అందిస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు మాట మార్చారు.  వివాహమైనా ప్యాకేజి అందిస్తామని అధికారులు ముందుగా చెప్పడంతో అప్పట్లో 500 మంది యువతుల వివాహాలు చేశారు. ఆ తరువాత మాట మార్చిన అధికారులు వివాహమైన 500 మంది యువతుల పేర్లు తొలగించారు. వివాహమైతే ప్యాకేజి రాదన్న నిబంధనతో దాదాపు 400 మంది యువతుల వివాహాలు ఏడాది కాలంగా నిలిచిపోయాయి.

ప్యాకేజ్ ఎప్పుడు అమలు చేస్తారో తెలియక ,ప్యాకేజి వదులుకోని వివాహాలు చేయలేక యువతుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు. ఎదిగి వచ్చిన బిడ్డలను ఇంట్లో పెట్టుకొని కుమిలిపోతున్నారు. బిడ్డల పెళ్లిలు చేసి ఆనందంగా ఉందామనుకున్న తమకు కన్నీరు మిగులుతుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నిబంధనల్లో మార్పుల చేస్తే తమ బిడ్డల పెళ్లి చేసి  ఓ ఇంటి వారిని చేస్తామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితులు తమ బాధను తెలుగురాజ్యంతో చెప్పారు. వారేమన్నారంటే…

నాకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. భర్త లేడు. పెద్దమ్మాయి వయస్సు 25 ఏళ్లు. వివాహమైతే ప్యాకేజి రాదని చెప్పారు. దీంతో తన కూతురికి ఇంకా వివాహం చేయలేదు. ప్యాకేజి ఎప్పుడు ఇస్తారో తెలియదు.

            -మాడే అక్కమ్మ, తల్లవరం గ్రామం

నాకు ఒక అమ్మాయి. వయస్సు 20 ఏళ్లు. పెళ్లి సంబంధం కుదిరింది.వివాహమైతే ప్యాకేజ్ ఇవ్వనంటున్నారు. దీంతో పెళ్లి ఆపాం. ప్యాకేజ్ వస్తుందనడంతో లాంఛనాలు కూడా ఎక్కువ అడుగుతున్నారు.

-మడకం నాగమణి, గాజుల గొంది గ్రామం