పదో తరగతి అమ్మాయి గొంతు కోసిన ప్రేమోన్మాది

సికింద్రాబాద్ లోని ఐడిఎ బొల్లారంలో పదో తరగతి చదువుతున్న నిఖిత అనే అమ్మాయిని గొంతు కోసం అత్యంత దారుణంగా హత్య చేశాడు ప్రేమోన్మాది. ఈ ఘటన సికింద్రాబాద్ లో కలకలం రేపింది. 

గత కొంత కాలంగా టెన్త్ క్లాస్ చదివే నిఖితను ప్రేమ పేరుతో ఆ యువకుడు వేధింపులకు గురిచేస్తున్నారు. ఆ అమ్మాయి నిరాకరించడంతో కక్ష పెంచుకున్న ఆ యువకుడు గురువారం సాయంత్రం ఐడిఎ బొల్లారం లో ఆ విద్యార్థిని గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు.

దీంతో రక్తపు మడుగులో పడి ఆ విద్యార్థిని గిలగిల కొట్టుకుంది. ఆమెను స్థానికులు కూకట్ పల్లిలోని ఒక ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. కానీ ఆమె కోలుకోలేదు. చికిత్స పొందుతూ మరణించింది. 

దాడికి పాల్పడిన ప్రేమోన్మాది పరారీలో ఉన్నాడు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.