మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో కొత్తకోణం, 3 కోట్ల ఆఫర్
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు ప్రణయ్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కోపంతోనే అల్లుడు ప్రణయ్‌ని అమ్మాయి తండ్రి సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
యువతి అమృత వర్షిణి వైశ్య (కోమటి) కులానికి చెందినది. యువకుడు పెరుమాళ్ల ప్రణయ్ ఎస్సీ (మాల) కులానికి చెందిన వ్యక్తి. వీళ్లిద్దరూ బీటెక్ నుంచి ప్రేమించుకుంటున్నారు. ప్రేమ విషయం వర్షిణి ఇంట్లో తెలియడంతో ఆమె తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అమ్మాయిని వేధింపులకు గురిచేశాడు.
అయితే, వర్షిణి మాత్రం ప్రణయ్‌ని వదలి పెట్టలేదు. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని హైదరాబాద్ పారిపోయారు. ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకుని మిర్యాలగూడలోనే కాపురం పెట్టారు.. అప్పట్నుంచి వర్షిణి తండ్రి మారుతీరావు నుంచి బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. వేధింపులు మరింత పెరగడంతో వర్షిణి, ప్రణయ్ ఐజీని ఆశ్రయించారు. తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. ఐజీ ఆదేశాలతో ఎస్పీ యువతి, యువకుడి తరపు తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఆ తర్వాత నుంచి మారుతీరావు ప్రవర్తనలో మార్పు వచ్చింది. కూతురితో సఖ్యంగానే ఉంటున్నట్లు నటించాడు. రెగ్యులర్‌గా ఫోన్లు మాట్లాడటం, తరచూ వారిని చూసేందుకు వస్తుండటంతో అంతా సర్దుకుపోయిందని భావించారు. పోలీసులు కూడా కలిసున్నారనే అనుకున్నారు. కానీ, మారుతీరావు ఓ వైపు మంచిగానే నటిస్తూ, మరోవైపు నుంచి తన ప్లాన్ అమలు చేశాడు.. ఇందులో భాగంగానే ఓ గ్యాగ్‌కు సుపారీ ఇచ్చి అల్లుణ్ని అడ్డుతొలగించుకోవాలనుకున్నాడు.
ఈ కేసులో మారుతీరావు తమ్మడు కూడా నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరూ కలిసి పది లక్షల సుపారీ ఇచ్చి మరీ కన్నకూతురు భర్తను హత్య చేయించారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అమ్మాయి వర్షిణి మూడు నెలల గర్భవతి అని చెబుతున్నారు. అయినా పథకం ప్రకారం ఆమె కండ్ల ముందే తన భర్తను దారుణంగా నరికి చంపడం మిర్యాలగూడలో కలవరం రేపింది. మంచిగా ఉన్నట్లు నటిస్తూనే ఇంతటి దారుణానికి పాల్పడడం జనాలను కలిచివేస్తున్నది. హత్య జరిగే కంటే 45 నిమిషాల ముందు నుంచి వారు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రేమను త్యాగం చేస్తే ప్రణయ్ కి 3 కోట్ల ఆఫర్ ?
ప్రణయ్, వర్షిణి ప్రేమించుకున్న విషయం తెలియగానే అమ్మాయి తండ్రి మారుతీరావు అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. ప్రేమను భగ్నం చేసేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాడు. మిర్యాలగూడ పట్టణంలో మారుతీరావు కుటుంబం సంపన్నమైన కుటుంబంగా చెబుతున్నారు. ప్రణయ్ ఫ్యామిలీ కూడా ఎగువ మధ్య తరగతి కుటుంబమే. మారుతీరావుకు ఒక్కతే కూతురు కావడంతో ప్రేమ పెళ్లిని అంగీకరించలేకపోయాడు మారుతీరావు. అయితే తన కూతురును మరిచిపోవాలని ప్రణయ్ కి మూడు కోట్ల రూపాయలు ఇస్తానని ఆఫర్ పెట్టినట్లు తెలిసింది. కానీ ప్రణయ్ అంగీకరించలేదు. మారుతీ ఇచ్చిన ఆఫర్ రిజెక్ట్ చేసిన ప్రణయ్, అమృతను పెళ్లి చేసుకోవడానికే మొగ్గు చూపారు. తుదకు ఇలా ఈ ప్రేమ కథకు ముగింపు పలికాడు మారుతీరావు.
నిందితుల గాలింపు : ఐదు ప్రత్యేక బృందాలు
నిందితులుగా అనుమానిస్తున్న మారుతీరావు, అతడి తమ్ముడి కోసం ఐదు ప్రత్యేక బృందాలను నియమించారు నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాథ్. ఇప్పటికే హత్యపై కీలక ఆధారాలు సేకరించారు పోలీసులు. గాలింపు జరుగుతున్నది.