ఎక్స్ ప్రెస్ టివి చైర్మన్ దారుణ హత్య (వీడియో)

ఎక్స్ ప్రెస్ టివి చైర్మన్ చిగురుపాటి జయరాం దారుణ హత్యకు గురయ్యాడు. నందిగామ మండలం ఐతవరం హైవే పక్కన కారులో ఆయన రక్తపు మడుగులో కనిపించాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారమివ్వగా వారు విచారణ చేశారు. చనిపోయింది ఎన్ ఆర్ ఐ చిగురుపాటి జయరాంగా గుర్తించారు. ఆయనది హత్యేనని పోలీసులు తేల్చారు. జయరాం ఎక్స్ ప్రెస్ టివి న్యూస్ చానల్ కు చైర్మన్ గా వ్యవహరించారు. జయరాంకు ఫార్మా, సీడ్స్ కంపెనీలు మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి.

జయరాం కారును మరో వ్యక్తి నడుపుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. జయరాం కారు డ్రైవర్ ఎక్కడికెళ్లాడని పోలీసులు విచారిస్తున్నారు. రెండు రోజుల క్రితమే జయారాం హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాడు. జయరాం తన భార్య, పిల్లలతో కలిసి అమెరికాలోని ఫ్లోరిడాలో నివాసముంటున్నాడు. అతనికి అమెరికా పౌరసత్వం ఉంది. నెల రోజుల క్రితమే జయరాం అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చాడు. పలు బ్యాంకులలో జయరాంకు పార్టనర్ షిప్ కూడా ఉంది. అమెరికాలో కూడా ఓ బ్యాంకులో జయరాం పార్ట్ నర్ గా ఉన్నారు. సామాన్య కుటుంబంలో పుట్టిన జయరాం పారిశ్రామికవేత్తగా ఎదిగాడు. ఎక్స్ ప్రెస్ టివిని కూడా బాగానడిపారు. కానీ నష్టాలు రావడంతో దానిని మూసివేశారు.

జయరాం తల పై బలమైన గాయాలున్నాయి. అతనిని కారు వెనుక సీటులో హత్య చేసి బండరాళ్లతో తల పై మోదినట్టు పోలీసులు గుర్తించారు. జయరాం అంటే పడని వారే ఈ దారుణానికి పాల్పడవచ్చని పోలీసులు అంటున్నారు. జయరాం భార్య పిల్లలకు పోలీసులు సమాచారమిచ్చారు. జయరాం హత్య  అతనికి తెలిసిన వారే చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదం వీడియో కింద ఉంది చూడండి.