Crime: ఈజీ మనీ పేరుతో ప్రజలను బురిడీ కొట్టించారు కొందరు మోసగాళ్లు. గూగుల్ ప్లే స్టోర్ లో ఉన్న యాప్ ల ద్వారా ఆకర్షించారు. దేశవ్యాప్తంగా 5లక్షల మందిని మోసం చేసి కోట్లలో మోసం చేసారు. దీనిపై ఫిర్యాదులు అందుకున్న పోలీసులు వీరి గుట్టు రట్టు చేశారు. ఇదంతా కేవలం రెండు నెలల కాలంలోనే చేశారంటే ఆశ్చర్యం కలగక మానదు. ‘పవర్ బ్యాంక్’ అనే యాప్ ద్వారా 11 మంది సభ్యుల ముఠా ఈ మోసాలకు పాల్పడ్డారు. గుగుల్ ప్లేస్టోర్ లో ‘పవర్ బ్యాంక్’ అనే ఇన్వెస్ట్ మెంట్ యాప్ క్రియేట్ చేసి ఎక్కువ రిటర్న్స్ తక్కువ కాలంలోనే ఇస్తామంటూ ఆకర్షించింది. దీంతో వేల సంఖ్యలో యాప్ డౌన్ లోడ్స్ అయ్యాయి.
పెట్టుబడులపై 5-10 శాతం ఇన్ స్టంట్ రిటర్న్స్ వస్తాయని.. ఇది ప్రారంభ ఆఫర్ అంటూ ప్రకటించింది. దీంతో ఈజీ మనీ కోసం ఎందరో లక్షల్లో ఇన్వెస్ట్ చేశారు. ఇలా కోట్లలో వసూలయ్యాక యాప్ పని చేయడం ఆగిపోయింది. దీంతో బాధితులు ఢిల్లీ సైబర్ పోలీసుల్ని ఆశ్రయించడంతో మోసం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు 11 మందిని అరెస్టు చేశారు. దీనిపై ఢిల్లీ పోలీసు సైబర్ స్పెషల్ అన్వేశ్ రాయ్ మాట్లాడారు. ‘పవర్ బ్యాంక్, ఈజడ్.. అనే యాప్స్ గురించి మాకు ఫిర్యాదులు అందాయి. వేలల్లో డౌన్ లోడ్లు జరిగాయి.. లక్షల్లో నష్టపోయారు. పవర్ బ్యాంక్ యాప్ బెంగళూరులో ఏర్పాటైనట్టు కనిపిస్తున్నా.. సర్వర్ చైనాలో ఉంది. ప్రస్తుతం యూజర్ల ఖాతాలు బ్లాక్ చేశాం.
‘యాప్ క్రియేటర్ గా భావిస్తున్న పశ్చిమ బెంగాల్ లోని కు చెందిన ఉలుబేరియాకు చెందిన షేక్ రూబిన్ ను ఈనెల 2న అరెస్టు చేయగా, 9 మందిని ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో అరెస్టు చేశాం. మరో నిందితుడి కోసం గాలిస్తున్నాం. నిందితుల్లో ఇద్దరు అవిక్ కేడియా రొనాక్ బన్సాల్ చార్టర్డ్ అకౌంటెంట్లుగా ఈ ముఠాలో పని చేశారు. 110కి పైగా డొల్ల కంపెనీలు సృష్టించి ఒక్కో కంపెనీ నుంచి చైనీయులకు 2-3 లక్షలు చొప్పున బదిలీ చేశారు. టెలిగ్రామ్ ద్వారా చైనీయులు రూబిన్ కు పరిచయం. వారు చెప్పిన మీదట రూబిన్ 29 బ్యాంకు ఖాతాలు తెరిచి ఈ మోసాలకు పాల్పడ్డారు’ అని తెలిపారు.